ఆల్ టైమ్ హై వద్ద ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ సానుకూల ధోరణలకు దేశీయంగా పటిష్ఠమైన గణాంకాలు తోడవడంతో నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. నిఫ్టితో పాటు సెన్సెక్స్ ఇవాళ కొత్త ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకాయి. ముఖ్యంగా నిఫ్టి 19000 స్థాయిని దాటడం విశేషం. ఆరంభంలోనే కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత 19011 పాయింట్లకు చేరింది. చివర్లలో స్వల్ప లాభాల స్వీకరణతో 18972 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 154 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. ఆరంభం నుంచి చివరిదాకా నిఫ్టిలో అప్‌ట్రెండ్ కొనసాగడం విశేషం. ఇవాళ బ్యాంక్, మిడ్‌క్యాప్, నిఫ్టి నెక్ట్స్ కన్నా నిఫ్టి షేర్లే బాగా రాణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ గ్రీన్‌లలో వంద కోట్ల బ్లాక్ డీల్ కుదరడంతో అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ఆరు శాతం లాభంతో ముగిసింది. అదానీ గ్రీన్ మాత్రం క్రితం ముగింపు వద్దే ముగిసింది. అదానీ పోర్ట్స్ 5 శాతం దాకా లాభపడింది. జిందాల్ స్టీల్ ఇవాళ కూడా మూడు శాతం పెరగ్గా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా రెండు శాతం లాభంతో ముగిశాయి. నిన్న టాప్ గెయినర్‌గా ఉన్న హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇవాళ నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది. నిన్న ఆరున్నర శాతం లాభపడగా, ఇవాళ ఒక శాతం నష్టంతో క్లోజైంది. ఐటీ షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పించింది. మరోవైపు యూరో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. రేపు మార్కెట్‌కు బక్రీద్ సెలవు.