19 ఏళ్ళ తరవాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ
టీసీఎస్ తరవాత అంటే 19 ఏళ్ళ తరవాత టాటా గ్రూప్ నుంచి ఓ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఆఫర్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మార్చిలో టాటా టెక్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ పబ్లిక్ ఆఫర్ మొత్తం ఆఫర్ ఫర్ సేల్. అంటే ప్రమోటర్లు కంపెనీలో ఉన్న వాటాల్లో కొంత భాగాన్ని అమ్మనున్నారు. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 9.57 కోట్ల షేర్లు అంటే 23.60 శాతం వాటాలను అమ్మనున్నారు. ఆఫర్ ధర ఇంకా నిర్ణయించలేదు. ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా టాటా గ్రూప్ రూ. 4000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలకు టెక్నాలజీని, డిజిటల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ను టాటా టెక్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఎలెక్సి, ఎల్ అండ్ టీ టెక్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి. 1994లో కోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ పేరుతో నెలకొల్పిన ఈ కంపెనీని 2001 ఫిబ్రవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. ఈ కంపెనీకి చాలా భాగం టర్నోవర్ టాటా గ్రూప్ కంపెనీల నుంచి వస్తోంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా టెక్ రూ. 3011 కోట్ల టర్నోవర్‌పై రూ. 407 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సెబీ అనుమతి రావడంతో… ఇష్యూకు సంబంధించిన ఇతర వివరాలను టాటా గ్రూప్ వెల్లడించనుంది.