బంపర్ లాభాలతో ముగిసిన నిఫ్టి
దాదాపు 16 వారాల తరవాత నిఫ్టి ఒక్క సెషన్లో అత్యంత భారీ లాభాలను ఆర్జించింది. నిన్నటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు హోరెత్తినా… మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్ కారణంగా నిన్న నిఫ్టి పరిమిత లాభాలకే పరిమితమైంది. మార్చి నెల డెరివేటివ్స్ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఇవాళ 17644ని తాకి 17594 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 272 పాయింట్లు లాభపడింది. ఓపెనింగ్‌తో పోలిస్తే నిఫ్టి 200 పాయింట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా అదానీ గ్రూప్‌లో జీక్యూజీ పార్ట్నర్స్ వాటా కొనుగోలు చేయడంతో… అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్లలో విశ్వాసం వచ్చింది. దీంతో దాదాపు అన్ని అదానీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మొన్నటి దాకా భారీ నష్టాల్లో ట్రేడైన షేర్లు ఇపుడు వరుస లాభాలతో ముగుస్తున్నాయి. ఇవాళ ర్యాలీలో బ్యాంక్ నిఫ్టి జోరుగా పాల్గొంది. ఈ సూచీ రెండు శాతంపైగా లాభపడింది. నిఫ్టిలో 42 షేర్లు లాభాల్లో ముగిశాయి.