కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి విస్తృత అధికారాలు కల్పించేందుకు ఓ కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇలాంటి కమిటీని వేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. హెండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ కంపెనీల ఇన్వెస్టర్లు భారీ నష్టపోయారని… ఇన్వెస్టర్ల సంరక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని, హిండెన్‌బర్గ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లను పరిశీలించిన కోర్టు… సెబికి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సలహా ఇచ్చింది. దీనికి స్పందించిన కేంద్రం కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై విచారించేందుకు సెబి సరైన సంస్థ అని కూడా కేంద్రం పేర్కొంది. సెబి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు.