For Money

Business News

చిన్న ఇన్వెస్టర్లకు ‘మార్జిన్‌’ తలనొప్పి

స్టాక్‌మార్కెట్‌లో షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ‘మార్జిన్‌’ నిబంధనలు చిన్న ఇన్వెస్టర్లకు తలనొప్పిగా మారాయి. కొత్త నిబంధనలపై స్పష్టత లేక పోవడంతో పాటు మారిన నిబంధనల మేరకు ఇన్వెస్టర్లు సిద్ధం కావడంతో నిన్న ట్రేడింగ్‌ మందగించింది. ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ ఖాతాల్లో నిధులు రెడీగా లేకున్నా… తమ డీమ్యాట్‌ ఖాతాల్లోని షేర్లు తనఖా నిమిత్తం బదిలీ చేసి ఉన్నా కొత్తగా షేర్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు స్టాక్‌బ్రోకర్‌ వద్ద ఉన్న మన ఖాతాల్లో నగదు ఉంటే షేర్లు కొనే వీలు ఉండేది. దీనికి ఇపుడు ట్రేడింగ్‌ ఖాతాకు అనుసంధానమైన మన బ్యాంక్‌ ఖాతాలో నగదు ఉంటే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన మార్పులతో చిన్న మదుపరులకు నష్టమని, ప్రస్తుతం మాదిరిగా తక్కువ సొమ్ముతో షేర్ల లావాదేవీలు నిర్వహించడం ఇకపై వీలుకాదని స్టాక్‌బ్రోకింగ్‌ వర్గాలు అంటున్నాయి. ‘మార్జిన్‌’ కోసం ఇన్వెస్టర్లు ఎక్స్ఛేంజీ వద్ద తనఖా పెట్టిన షేర్లను అమ్మాలంటే ముందుగా వాటిని తనఖా నుంచి వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాటిని విక్రయించడానికి వీలుకలుగుతుంది. తాజా నిబంధనల వల్ల స్టాక్‌మార్కెట్లో ‘స్పెక్యులేషన్‌’ తగ్గుతుందని, షేర్ల ధరల్లో అధిక వ్యత్యాసాలు కనిపించవని, దీనివల్ల ‘స్వింగ్‌ ట్రేడర్లకు’ అవకాశాలు తగ్గుతాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.