ప్రయాణీకుల ఆదాయంలో 71 శాతం జంప్
ప్రయాణీకుల ద్వారా వచ్చే ఆదాయం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల్లో 71శాతం పెరిగినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. అంటే సరకు రవాణాతో నిమిత్తం లేకుండా కేవలం ప్రయాణీకుల ద్వారా వచ్చిన మొత్తం ఇది. 2021 ఏప్రిల్, డిసెంబర్ మధ్య రూ.28,569కోట్ల ఆదాయం వచ్చిందని అని రైల్వే శాఖ వెల్లడించింది.రిజర్వ్డ్ ప్యాసింజర్ విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ వృద్ధి ఉందని రైల్వే శాఖ ప్రకటించింది. రూ.38,483 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 56శాతం అధికమని వెల్లడించింది. ఇక 2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ల నుంచి వచ్చిన ఆదాయం రూ.10,430గా ఉంది. కిందటి ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య రూ.2,169 కోట్లుగా ఉండగా.. ఏకంగా 381 శాతం వృద్ధి ఉంది. 2021లో కరోనా ప్రభావం కారణంగా రైల్వే ఆదాయం తక్కువగా ఉంది. దీంతో పోల్చినపుడు 2022లో అధిక ఆదాయం వచ్చినట్లు కన్పిస్తోంది.