షార్ట్ కవరింగ్‌తో సూపర్ జంప్
డెరివేటివ్స్ విభాగంలో డిసెంబర్ సిరీస్ అదిరి పోయే ముగింపు ఇచ్చింది. 18000 పుట్ రైటింగ్ ఎంత బలంగా ఉందంటే చివర్లో ట్రేడర్లు తమ పొజిషన్స్ షార్ట్ కవర్ చేసుకోక తప్పలేదు. దీంతో ఒకదశలో 17992 పాయింట్లకు పడిపోయిన నిఫ్టి మిడ్ సెషన్ నుంచి కోలుకోవడం ప్రారంభమైంది. నిఫ్టి పడకపోవడంతో… అప్పటికే షార్ట్ చేసిన వారు తమ పొజిషన్స్‌ను కవర్ చేసుకోవడం ప్రారంభించారు. 2.40 గంటలకు గ్రీన్‌లో వచ్చిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18229 పాయింట్ల స్థాయిని తాకింది. క్లోజింగ్‌లో 18191 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 68 పాయింట్లు లాభపడింది. నిఫ్టి ఇవాళ పూర్తి బలం నిఫ్టి బ్యాంక్ నుంచి వచ్చింది. అనలిస్టులు ముందు నుంచి బ్యాంక్ నిఫ్టి గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. బ్యాంక్ నిఫ్టి బలంగా ఉందని… దిగువ స్థాయి నుంచి కోలుకుంటుందని. ఇవాళ అదే జరిగింది. ఉదయం నష్టాల్లో ఉన్న అన్ని బ్యాంకు షేర్లు లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టి ప్రధాన బ్యాంక్ షేర్లు భారీగా కోలుకున్నాయి. దీంతో నిఫ్టి బ్యాంక్ 0.99 శాతం లాభంతో ముగిసింది. అయితే నిఫ్టి నెక్ట్స్ స్థిరంగా ముగియగా, నిఫ్టి మిడ్ క్యాప్ 0.34 శాతం నష్టంతో ముగిశాయి. పేమెంట్ బ్యాంక్‌ను లిస్ట్ చేస్తారన్న వార్తతో భారతీ ఎయిర్ టెల్ నష్టాల నుంచి కోలుకుని 2.39 శాతం లాభంతో ముగిసింది. అలాగే అదానీ టోటల్ గ్యాస్ మరో ఏడు శాతం పెరిగింది. అదానీ ట్రాన్స్ కూడా 5.66 శాతం లాభపడటం విశేషం. శ్రీసిమెంట్ 4 శాతంపైగా నష్టపోయింది. అలాగే మిడ్ క్యాప్‌లో శ్రీరామ్ ఫైనాన్స్ అయిదు శాతంపైగా నష్టపోయింది. ఇక బ్యాంక్ నిఫ్టిలో ఒక్క కొటక్ బ్యాంక్ మినహా మిగిలిన 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫెడరల్ బ్యాంక్ మూడు శాతంపైగా లాభపడింది.