స్వల్పంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.46 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది నవంబర్లో వసూలైన 1.31 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లలో ఈ ఏడాది 11 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో గత నెల రూ.1.51 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంతమేర తగ్గాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ (CGST) కింద రూ.25,681 కోట్లు, ఎస్జీఎస్టీ (SGST) కింద రూ.32,651 కోట్లు, ఐజీఎస్టీ (IGST) కింద రూ.77,103 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో రూ.10,433 కోట్లు వచ్చినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. గతేడాది నవంబర్లో ఏపీలో రూ.2,750 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈసారి రూ.3,134 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో రూ. 3,931 కోట్ల నుంచి రూ. 4,228 కోట్లకు చేరాయి.