ఆల్ టైమ్ హై… ఈసారి సెన్సెక్స్ వంతు
మొన్న బ్యాంక్ నిఫ్టి.. నిన్న నిఫ్టి.. ఇవాళ సెన్సెక్స్… వెరిశి ఇవాళ స్టాక్ మార్కెట్లో అన్ని సూచీలు కొత్త ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. ఉదయం 62,616 పాయింట్లని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18,816ని తాకింది. బై ఆన్ డిప్ పద్ధతిని పాటించి డే ట్రేడర్లకు, పొజిషనల్ ట్రేడర్లకు ఇవాళ భారీగా లాభాలు వచ్చాయి. ముఖ్యంగా రేపు డెరివేటివ్స్ క్లోజింగ్ నేపథ్యంలో వీక్లీ కాంట్రాక్ట్‌లు చాలా చురుగ్గా ట్రేడయ్యాయి. సరిగ్గా మూడు గంటలకు ప్రారంభమైన షార్ట్ కవరింగ్ నిఫ్టి 18816 దాకా తీసుకెళ్ళింది. చివర్లో 18758 వద్ద ముగిసింది. ఇవాళ నిఫ్టి 140 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్కూడా ఓ దశలో 63,303.01 వద్ద కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకి … 417.80 పాయింట్లు లాభంతో 63,099 వద్ద ముగిసింది. ఉదయం నుంచి అనలిస్టులు చెబుతున్నట్లు ఇవాళ మెటల్స్, సిమెంట్ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టి 45 షేర్లు లాభాలతో ముగిశాయి. మిడ్ క్యాప్ షేర్లలో ర్యాలీ రావడంతో నిఫ్టి బ్యాంక్ ఇవాళ ఒక మోస్తరు లాభాలకే పరిమితమైంది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ హోల్డింగ్స్, అదానీ ట్రాన్స్, అదానీ గ్రీన్, జొమాటా భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న 7 శాతం పైగా లాభపడిన గ్లాండ్ ఫార్మా ఇవాళ అయిదున్నర శాతం నష్టంతో ముగిసింది. మరోవైపు లారస్ ల్యాబ్ రెండు శాతం లాభపడింది.