ఫోర్బ్స్ లిస్ట్‌లో అదానీ టాప్..
దేశంలో టాప్-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 80,000 కోట్ల డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా 2022 ధనికుల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాదిలో కోటీశ్వరుల సంపద 2,500 కోట్ల డాలర్లు మేరకు పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది. టాప్-100 జాబితాలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలవగా.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల తన కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయించిన నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చేరారు. ఇక లిస్టింగ్ ధర నుంచి ఏకంగా 75 శాతం షేర్ విలువ పడిపోవడంతో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ జాబితా నుంచి వైదొలిగారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద మొత్తం 15,000 కోట్ల డాలర్లు (రూ. 1,211,460.11 కోట్లు) కాగా, 8చ800 కోట్ల డాలర్ల (రూ.710,723.26 కోట్లు)తో ముకేష్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో డీమార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమాని ఉన్నారు. ఆయన సంపద 2760 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. 2150 కోట్ల డాలర్లతో సైరస్ పూనావాలా నాలుగో స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ అధినేత శివ నాడార్ 2140 కోట్ల డాలర్ల సంపదతో అయిదో స్థానంలో ఉన్నారు. శివనాడార్ దక్షిణాది పారిశ్రామిక వేత్త అయినా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంటారు. దక్షిణాదిలో అత్యంత ధనవంతుడిగా విప్రో ప్రేమ్‌జీ నిలిచారు. ఆయన సంపద 930 కోట్ల డాలర్లు. అజీమ్ ప్రేమ్ జీ తరవాత దక్షిణాది నుంచి కనిపించే పేరు హైదరాబాద్‌కు చెందిన మురళీ దివి. దివి ల్యాబ్స్ అధినేత అయిన మురళీ సంపద 645 కోట్ల డాలర్లు. 430 డాలర్ల సంపదతో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 41వ స్థానంలో ఉన్నారు.