రూ. 1,50,000 కోట్ల నష్టం
గత ఏడాది.. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో… మూడో వంతు పడిపోయిన నిఫ్టి… మళ్ళీ కోలుకోవడమేగాకుండా… కొత్త శిఖరాలను అందుకుంటున్న సమయం. చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు తాము గోల్డన్ ఛాన్స్ మిస్సయినట్లు ఫీలయ్యారు. కరోనా సమయంలో ఐటీ, టెక్ కంపెనీల షేర్లు ఆకాశాన్నంటడంతో .. టెక్ అంటే చాలు ఇన్వెస్టర్లు పరుగులు పెట్టారు. ప్లాట్‌ఫామ్ ఆధారంగా పనిచేసే కంపెనీల షేర్లను పోటీపడి కొన్నారు. దీన్నే ఆసరగా చేసుకుని అనే కంపెనీలు తమ వాస్తవ విలువను పక్కన బెట్టి… జనం క్రేజ్‌ను క్యాష్ చేసుకున్నాయి. పేటీఎం వంటి షేర్లు.. మళ్ళీ ఆఫర్ ధరను అందుకోక పోగా… కొత్త రికార్డులు సృష్టించిన నైకా కూడా ఇపుడు ఇన్వెస్టర్లకు కాళరాత్రి చూపిస్తోంది. గడచిన 16 నెలల్లో పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధులు సమీకరించిన పలు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు దాదాపు 1800 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 1,50,000 కోట్ల వరకు నష్టపోయినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోవడ్డీ రేట్లు పెరగడం, ఆయా కంపెనీల వ్యాల్యూయేషన్ మరీ అధికంగా ఉన్నందున పలు కంపెనీల షేర్లు భారీగా నష్టపోయినట్లు ఈ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పేటీఎం పతనానికి ఇదే కారణం. పైగా భారీ నష్టాలతో యాంకర్ ఇన్వెస్టర్లు, ప్రమోటర్ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మడం. నిజానికి పేటీఎం షేర్లు చాలా హెచ్చుతగ్గులకు లోనైంది. ఎప్పటికపుడు నష్టంతో బయటపడినవారు బతికిపోయారనే చెప్పాలి. ఎందుకంటే ఆఫర్లో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉంచుకుని ఉంటే… తీవ్రంగా నష్టపోయినట్లే.. దాదాపు రూ.2000 నుంచి రూ. 510కి పడింది ఈ షేర్. ఇక తరవాతి షేర్ జొమాటొ. ఈ షేర్‌ను వేలంవెర్రిగా కొన్నారు. లిస్టింగ్ తరవాత ఈ షేర్ లాభాలను ఇచ్చింది. ఆ లాభాలతో బయపటపడినవారు అదృష్టవంతులు. కాని దీర్ఘకాలానికంటూ అట్టిపెట్టుకున్నవారు బాగా నష్టపోయారు. ఇక రీటైల్ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ నైకాను నమ్ముకున్న ఇన్వెస్టర్లు కూడా నిట్టనిలువునా మునిగి పోయారు. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ ఇన్ పీరియడ్ ముగుస్తున్న సమయంలో సరిగ్గా బోనస్ షేర్లను ప్రకటించి… వెంటనే అమ్మకాల ఒత్తిడిని ఆపింది కంపెనీ. కాని మూడు రోజుల్లోనే 20 శాతంపైగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ షేర్ కూడా భారీ నష్టాలను మిగిల్చింది. అలాగే ఓ మీడియా సంస్థకు వాటా ఉన్న డెలివరీ అనే కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసిన ఆ తరవాత ఇన్వెస్ట్ చేసినవారు కూడా నష్టపోయారు. పేటీఎం మాదిరి సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు ఉన్న పాలసీ బజార్ షేర్ కూడా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఎల్ఐసీ షేర్ కూడా ఇలానే పడినా.. ఇది టెక్ కంపెనీ కాదని… తొందర్లోనే కోలుకుంటుందని అనలిస్టులు అంటున్నారు.కరోనా సమయంలో సాధారణ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం పలు ఈజీ మనీ విధానాలను అవలంబించడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఈ ఐపీఓల్లో పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు చిన్న పొదుపు మొత్తాలపై కూడా పెద్దగా వడ్డీ లేకపోవడంతో… అనేక మంది అనుభవం లేకున్నా స్టాక్ మార్కెట్‌వైపు పరుగులు పెట్టారు. తీవ్రంగా నష్టపోయారు. చిత్రంగా షేర్ మార్కెట్ ప్రధాన సూచీలు ఎన్ఎస్ఈ నిఫ్టి50, బీఎస్ఈ సెన్సెక్స్‌లు కొత్త రికార్డులు సృష్టిస్తుండగా… బాగా నష్టపోయిన సాధారణ సంఖ్య మాత్రం రోజు రోజుకీ పెరుగుతోంది. ఎందుకంటే మన మార్కెట్లో అమెరికా మాదిరిక కరెక్షన్ రాలేదు. ఫండమెంటల్స్, బ్యాలెన్స్ షీట్స్ చూడకుండా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడం ఒక తప్పయితే… నష్టాలు ఉన్న కంపెనీలను కూడా లిస్టింగ్ అనుమతి ఇచ్చి ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించింది.