సగం మంది ఉద్యోగులు ఔట్?

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడం ఆ కంపెనీ ఉద్యోగులకు శాపంలా మారింది. ఇప్పటికే కంపెనీలోని టాప్ లెవల్ ఉద్యోగులను సాగనంపిన మస్క్… ఇపుడు ఉద్యోగులపై దృష్టి పెట్టాడు. కంపెనీలో సగం మందిని ఇంటికి పంపాలని ఆయన భావిస్తున్నారని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. ట్విటర్‌లో 7,500 మంది ఉద్యోగులు ఉండగా… వీరిలో 3,700 మంది ఉద్యోగులపై మస్క్ వేటు వేయనున్నారని ఆ వార్తా సంస్థ పేర్కొంది. ఈ వారాంతంలోనే ఆయా ఉద్యోగులకు సమాచారం అందించనున్నారని పేర్కొంది. వర్క్ ఫ్రం హోం నుంచి తిరిగి కార్యాలయాలకు రావాలని ట్విటర్ ఉద్యోగులను మస్క్ కోరనున్నారని అంటున్నారు. ఇక బ్లూటిక్‌తో పాటు ఇతర అదనపు ప్రయోజనాలు తమ సబ్‌స్క్రయిబర్లు పొందాలంటే నెలకు 8 డాలర్లు వసూలు చేయాలని మస్క్ నిర్ణయించారు. ఇది అమెరికాలో మాత్రమే. ఇతర దేశాల్లో మరింత ఎక్కువ ఉండొచ్చు. ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా… మస్క్ మాత్రం తన ప్రతిపాదనతో ముందుకు వెళ్ళేందుకు సిద్ధమౌతున్నారు.