ఫలితాల దెబ్బకు 10% డౌన్
స్టాక్ మార్కెట్లో ఫార్మా కౌంటర్లలో చాలా మందికి లారస్ ల్యాబ్ ఫేవరేట్ షేర్. ప్రతి క్వార్టర్ అద్భుత ఫలితాలు ప్రకటించిన ఈ హైదరాబాద్ కంపెనీ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాల మేరకు రాణించలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1576 కోట్ల టర్నోవర్‌పై రూ. 233 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవర్ 31 శాతం పెరగ్గా, నికర లాభం 15 శాతం పెరిగింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై 80 పైసల (40శాతం) డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ రూ. 416 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ సీఎఫ్ఓ వివి రవికుమార్ తెలిపారు. మున్ముందు కూడా పెట్టుబడులు అనుకున్న విధంగానే పెట్టనున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ పనితీరు పట్ల ఇన్వెస్టర్లలో అసంతృప్తి వ్యక్తమౌంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 1495 కోట్ల టర్నోవర్‌పై రూ. 231 కోట్ల నికర ప్రకటించింది. అంటే ఈ త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ కేవలం రూ. 3 కోట్లు పెరగ్గా.. నికర లాభం రూ. 2 కోట్లు పెరిగింది. ఫార్మా కౌంటర్లన్నీ బలంగా ఉండగా… ఈ షేర్ మాత్రం పది శాతం క్షీణించి రూ. 526 నుంచి రూ. 475కు క్షీణించింది. క్లోజింగ్‌లో రూ.477 వద్ద అంటే 9.36 శాతం నష్టంతో ముగిసింది. చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.