For Money

Business News

నిరాశపర్చిన రిలయన్స్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ కంపెనీ పనితీరు మార్కెట్‌ను నిరాశపర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌ పెరిగినా… నికర లాభం క్షీణించడం మార్కెట్‌ను ఆశ్చర్చపర్చింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 2.32 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్‌ టర్నోవర్‌ రూ.13,656 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవర్‌ 34 శాతం పెరిగినా నికర లాభం 0.2 శాతం తగ్గింది. మార్కెట్‌ మాత్రం రూ. 2.18 లక్షల కోట్ల టర్నవర్‌పై రూ. 15,664 కోట్ల నికరలాభం ఆర్జిస్తుందని అంచనా వేసింది. అదే ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం రూ.17,955 కోట్ల తో పోలిస్తే 24 శాతం పడిపోయింది.
ఈ ఏడాది జూలై 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ల ఎగుమతులు, క్రూడ్‌ ఉత్పత్తిపై వచ్చే లాభాల మీద కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల రిఫైనింగ్‌ మార్జిన్లు తగ్గాయని… ఇది కూడా లాభాల క్షీణతకు దారితీసిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రెండో త్రైమాసికంలో రూ.4,039 కోట్ల మేర విండ్‌ఫాల్‌ టాక్స్‌ భారం పడిందని కంపెనీ తెలిపింది. కంపెనీ జియో లాభం 4,518 కోట్లు
రిలయన్స్‌ జియో సెప్టెంబర్‌ త్రైమాసికానికిరూ.4,518 కోట్ల నికర లాభాన్ని గడించింది. నిరుడుతో పోలిస్తే ఇది 28 శాతం అధికమని పేర్కొంది. ఆదాయం 20 శాతం పెరిగి రూ.22,521 కోట్లకు చేరింది. ఏపీఆర్‌యూ కూడా రూ. 175.7 నుంచి రూ. 177.2కు పెరిగింది.
ఇక రిటైల్‌ విభాగం నికర ఆదాయం 44.5 శాతం పెరిగి రూ. 4,404 కోట్లకు చేరింది. 751 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం అవుట్‌లెట్స్‌ సంఖ్య 16,617కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఆపరేటింగ్‌ మార్జిన్‌ కూడా 1.30 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది.