పడినా… పైనే ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా… మన మార్కెట్లు లాభాలో ముగిశాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి.. ముగిసే సమయంలో మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చి 17576 వద్ద ముగిసింది. ఒకదశలో ఇవాళ్టి గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 150 పాయింట్లు క్షీణించింది. యూరో మార్కెట్లపై ఆశలతో మిడ్ సెషన్ వరకు గ్రీన్‌లో, బలంగా ఉన్న నిఫ్టి.. .తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. బ్యాంక్ నిఫ్టి ఒక్కటే నిఫ్టికి మద్దతుగా నిలిచింది. నిఫ్టి బ్యాంక్ 1.7 శాతం పెరగ్గా.. మిగిలిన ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి కూడా కేవలం 12 పాయింట్ల లాభంతో ముగిసింది. అత్యధికంగా నిఫ్టి నెక్ట్స్ 1.33 శాతం , నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ 0.92 శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టిలో 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టిలో టాప్ ఫైవ్ గెయినర్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఇవాళ దాదాపు పది శాతం లాభపడటం విశేషం. సోమవారం మూరత్ ట్రేడింగ్ ఒక గంట పాటు ఉంటుంది. మంగళవారం ట్రేడింగ్ జరిగినా.. బుధవారం మార్కెట్లకు సెలవు. గురువారం వీక్లీ, అక్టోబర్ నెల డెరివేటివ్స్‌కు క్లోజింగ్ కావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉన్నారు.