For Money

Business News

కీలక పత్రాలు బయటపెట్టిన జనసేన

వైజాగ్‌ దసపల్లా భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం భూముల వ్యవహారంలో వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దసపల్లా భూముల
కుంభకోణంలో ఉత్తరాంధ్ర ఇంచార్జి అయిన విజయసాయిరెడ్డి తన బినామీల పేరుతో వేలకోట్ల దసపల్లా భూముల బదిలీ చేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు ఇవాళ కొన్ని కీలక పత్రాలను బయట పెట్టారు. వైజాగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్ నిధుల మళ్ళింపు వ్యవహారాలను బయటపెట్టారు. దసపల్లా భూముల వెనుక విజయసాయి రెడ్డి ఎలా చక్రం తిప్పాడో ఆధారాలతో సహా బయట పెట్టారు. వివాదాస్పద దసపల్లా భూముల అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్న తమ బినామీ కంపెనీకి విజయ సాయి కుమార్తె, నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలకు చెందిన కంపెనీల అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు డాక్యుమెంట్లను బయట పెట్టారు.

ఇదీ జరిగింది

వైజాగ్ కేంద్రంగా వైజాగ్ కోస్ట్‌ రిసార్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే భాగస్వామ్య సంస్థ ఉంది. దీని పేరును ఇపుడు అస్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీగా మార్చారు. ఈ ఎల్‌ఎల్‌పీని కూనపురెడ్డి లక్ష్మి, కూనపురెడ్డి ఉమేష్‌ నెలకొల్పారు. ఈ కంపెనీలో లక్ష్మి, ఉమేష్‌ పెట్టిన పెట్టుబడి రూ. 20 లక్షలు. 2021 జూన్‌లో శ్రీయపురెడ్డి గోపీనాథ్‌ రెడ్డి భాగస్వామిగా చేరారు. ఈ భాగస్వామ్య సంస్థకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 4 కోట్లను అవయాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ నుంచి రుణంగా తీసుకున్నారు. పైగా ఈ మొత్తాన్ని ఇతరులకు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చేశారు. దసపల్లా భూముల అభివృద్ధికి అస్యూర్‌ ఎస్టేట్స్‌ పెట్టుబడి కేవలం రూ. 20 లక్షలు కాగా, మిగిలిన మొత్తం ఆవయాన్‌ కంపెనీదన్నమాట. ఈ అవయాన్‌ కంపెనీ ఎవరిదో కాదు. విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిది. వీరిద్దరూ నెలకొల్పిన ఈ కంపెనీ కోట్ల రూపాయల మొత్తాన్ని రుణంగా ఇచ్చింది. ఇది గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి. అయితే ఇప్పటికి విజయసాయి అల్లుడి కంపెనీ రూ. 9 కోట్లు ఇచ్చినట్లు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక విజయసాయి రెడ్డి ఉండబట్టే వీటికి సంబంధించిన ఫైల్స్‌ చకచకా కదులుతున్నాయని వీరు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా దసపల్లా భూములను పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన విజయసాయిరెడ్డి… అధికారంలోకి వచ్చిన తరవాత కోట్ల రూపాయల భూకబ్జాకు పాల్పడడం దారుణమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. రకరకాల సూట్ కేస్ కంపెనీల నుంచి కోట్ల రూపాయల బదిలీ జరిగినందున ఈ లావాదేవీల పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)తో విచారణ జరిపించాలన్నారు.