నేడే ప్రకటన…మళ్ళీ అర శాతం వడ్డింపు
ద్రవ్యోల్బణ కట్టడే టార్గెట్గా విధాన నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లను మరో అర శాతం పెంచనుంది.
ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ ప్రకటిస్తారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) గత బుధవారం నుంచి ప్రస్తుతం దేశంలోని ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తోంది. రెండు రోజల సమీక్ష తరవాత ఇవాళ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈసారి రెపో రేటును 0.35 శాతం నుంచి 0.50 శాతం వరకు పెంచవచ్చన్న వార్తలు వస్తున్నా… మెజారిటీ బ్యాంకర్లు మాత్రం అర శాతం పెంచుతుందని అంటున్నారు. బ్యాంకులు పోటీ పడి డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నా చిన్న మొత్తాల పొదుపుపై మాత్రం నామ మాత్రంగా వడ్డీ రేట్లను పెంచారు. నిధుల సమీకరణ భారం తక్కువగా ఉండేందుకు, తద్వారా బ్యాంకుల లాభదాయకత దెబ్బతినకుండా ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. పెరుగుతున్న ధరల మధ్య వడ్డీ భారం కూడా పెరగనుండటంతో మధ్య తరగతి ప్రజలు లబోదిబో మంటున్నారు.