విక్రమ్ వేదా ఎఫెక్ట్…ఈ రెండు షేర్లు కొనండి
సూపర్ హిట్ తమిళ చిత్రం విక్రమ్ వేదా అదే పేరుతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్‌లతో ఈ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఎంపిక చేసిన కొంత మంది జర్నలిస్టులకు ఈ సినిమా ప్రివ్యూ వేశారు. రివ్యూలు చాలా పాజిటివ్‌గా వస్తున్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని వార్తలు వస్తున్నాయి. పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా ఓపెనింగ్ కూడా రికార్డు స్థాయిలో ఉంటుందని బాంబే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లకు మంచి డిమాండ్ లభిస్తోంది. రివ్యూలు నిన్న రాత్రి రావడం.. ఇవాళ ఓపెనింగ్ నుంచి మార్కెట్ పాజిటివ్ ఉండటంతో పీవీఆర్ షేర్ ఇవాళ 4.52 శాతం పెరిగి రూ. 1756 వద్ద ట్రేడవుతోంది. రూ. 1730 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను ఇపుడు కూడా కొనుగోలు చేయొచ్చని.. టార్గెట్ రూ. 1800 లేదా రూ. 1820 కోసం కొనుగోలు చేయొచ్చని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రాజేష్ సత్పుతే సూచిస్తున్నారు. అలాగే ఐనాక్స్ షేర్ ఇవాళ 3 శాతం లాభంతో రూ. 511.70 వద్ద ట్రేడవుతోంది. రూ. 500 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయొచ్చని టార్గెట్ రూ. 525 లేదా రూ. 530ని తాకుతుందని రాజేష్ సలహా ఇస్తున్నారు.