డాలర్ దెబ్బకు ఇతర కరెన్సీల విలవిల
అమెరికాలో వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలోఅమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే డాలర్‌కు ఎక్కడ లేని డిమాండ్ వస్తోంది. అమెరికా ట్రెజరీల ఈల్డ్ కూడా భారీగా పెరుగుతోంది. డాలర్ ఇవాళ అనూహ్యంగా దాదాపు ఒకటిన్నర శాతం పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్ 112.5 దాకా వెళ్ళింది. గడచిన 20 ఏళ్ళలో ఇదే రికార్డు స్థాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ధోరణి చూస్తుంటే… వడ్డీ రేట్లు ఇంకా పెరిగేలా ఉన్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం ఖాయంలా కన్పస్తోంది. డాలర్ బలం ముందు ఇతర కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. యూరో కరెన్సీలు ఇవాళ భారీగా క్షీణించాయి. భారత రూపాయి కూడా 82వైపు పరుగులు తీసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. చాలా రోజుల నుంచి రూపాయిని కాపాడుతూ వచ్చిన ఆర్బీఐ ఈసారి చేతులు ఎత్తేసింది.