For Money

Business News

మార్గదర్శి కేసు: రామోజీరావుకు నోటీసులు

మార్గదర్శి కేసులో ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు సుప్రీం కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. హెచ్‌యూఎఫ్‌గా ఉంటూ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం చట్టబద్ధమా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ కోర్టు విచారణకు స్వీకరించింది. ఉండవల్లికేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్‌ అయింది. ఉండవల్లి వేసిన పిటీషన్‌పై కౌంటర్‌ వేయాల్సిందిగా రామోజీరావుతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఇంప్లీడ్‌ అవుతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనతో అన్నారని… ఏ కారణం చేతనో… కనీసం వకాలత్‌ నామా కూడా వేలయలేదని అన్నారు. అయితే రామోజీ రావు కూడా ఇవాళ స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ వేశారని… అందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారని ఉండవల్లి అన్నారు. రామోజీ రావు పిటీషన్‌పై కూడా స్పందించాల్సిందిగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ అయినట్లు ఆయన తెలిపారు. అయితే రామోజీరావు పిటీషన్‌లో ఏముందో తనకు ఇంకా తెలియదని అన్నారు. కేసు కొట్టేసినా ఆయన ఎందుకు పిటీషన్‌ వేశారో తనకు తెలియదన్నారు. మొత్తాన్ని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ అయినందున… అందరూ కౌంటర్‌ వేయాల్సి ఉంటుందన్నారు.