కేంద్రం ఖర్చుల్లో మా వాటా ఎంతో చెబుతారా?
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాలన్నీ మూసేసి… జనం నుంచి వసూలు చేస్తున్న పన్నలు, సెస్‌లను కబ్జా చేసిన కేంద్రం… ఇపుడు కొత్త పల్లవి అందుకుంది. కేంద్రం వాటా ఉంటే మోడీ ఫొటో పెట్టాలని కొత్త వాదన తెచ్చారు. అలాంటి ఆలోచన ఉంటే కేంద్రం ఆదేశాలు జారీ చేస్తే సరిపోతుంది కదా? ఓ కలెక్టర్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పబ్లిగ్గా నిలదీయడం ఎంత వరకు సమంజసం? మీరు చేస్తున్న పర్యటన ఖర్చులో మా రాష్ట్రం వాటా ఎంత అని స్థానిక నేతలు నిర్మలమ్మను నిలదీస్తే ఏమంటారు? పెట్రోల్, డీజిల్‌లో మీ దోపిడీ ఎంత అని నిలదీస్తే ఏమంటారు? వంటనూనెల్లో కేంద్రం కబ్జా చేస్తున్న సుంకాలు, పన్నులు ఎంత? అంటే ఏమంటారు? గ్యాస్‌లో కేంద్రం దోపిడీ ఎంత అంటే ఆమె దగ్గర సమాధానం ఉందా? దేశ జీడీపీలో 60 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది. ఈ సొమ్మునంతా కేంద్రం తనకు ఇష్టమొచ్చిన రాష్ట్రాలకు ధారాళంగా మంజూరు చేస్తోంది… దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు చూస్తోంది. కనీసం చట్టబద్ధంగా రావాల్సిన వాటా నిధులు కూడా విడుదల చేయడం లేదు. దక్షిణాదిలో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ నడ్డి విరిచిన మాట నిజం కదా? ఏదో విధంగా నెట్టకు వస్తున్న తెలంగాణకు కనీసం ఒక భారీ ప్రాజెక్టు కూడా మంజూరు చేయమని మాట వాస్తవం కాదా? ఇక తమిళనాడు రాష్ట్రం సంగతి సరే సరి. వేదిక మీద ప్రధాని ఉండగానే..మా వాటా నిధులు మాకు ఇస్తారా లేదా అని ఏకంగా సీఎం స్టాలిన్ మోడీని నిలదీసిన మాట నిజం కాదా? విద్యా, వైద్యం నుంచి అనేక అంశాల్లో నంబర్ వన్ రాష్ట్రమైన కేరళకు కేంద్రం ఇచ్చిన అదనపు వాటా ఎంత? మొత్తం పన్నులు, సెస్‌లను కొల్లగొట్టి ఉత్తరాది రాష్ట్రాలకు, అక్కడి పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టేలా కేంద్రం విధానాలు ఉండటం ఆర్థిక మంత్రికి తెలియదా? పబ్లిగ్గా ఓ కలెక్టర్‌ను నిలదీయడం చూస్తుంటే… దక్షిణాది రాష్ట్రాలు తెగించే పరిస్థితిని కేంద్ర కల్పిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రతి అంశంలోనూ మా వాటా తేల్చండని దక్షాణిరాష్ట్రాలు నిలదీస్తే నిర్మలమ్మ దగ్గర సమాధానం ఉందా? ప్రతిదీ రాజకీయం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. దేశ జీడీపీలో 60 శాతం కేవలం నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి సంపాదిస్తున్న కేంద్రం… ఇక్కడి రాష్ట్రాలనే నిలదీయడం విచిత్రం. పైగా దక్షిణాదికి చెందిన ఓ నేత ఇలా పబ్లిగ్గా అధికారులను నిలదీయడం బరితెగింపే. తెగేదాకా లాగాలని చూస్తున్నారేమో?