అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్
అంబుజా సిమెంట్, ఏసీసీ కంపెనీల వాటాదారులకు అదానీ గ్రూప్ నుంచి ఓపెన్ ఆఫర్ రానుంది. గత మే నెలలో అంబుజా సిమెంట్‌లో 63 శాతం వాటాను హోలిసిమ్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఏసీసీలో అంబాజా సిమెంట్‌కు మెజారిటీ ఉంది. కాబట్టి అంబుజా సిమెంట్ కొంటే ఏసీసీ కొన్నట్లే. పైగా ఏసీసీలో హోలిసిమ్‌కు అదనంగా ఉన్న 4.5 శాతం వాటాను కూడా అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో నిబంధనల ప్రకారం ఈ రెండు కంపెనీల వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంది. అంబుజా సిమెంట్‌లో మిగిలిన 26 శాతం వాటా కొనేందుకు ఒక్కో షేర్‌కు రూ. 385 అదానీ గ్రూప్ చెల్లించనుంది. అలాగే ఏసీసీ వాటాదారులకు ఒక్కో షేర్‌కు రూ. 2300 చొప్పున చెల్లించనుంది.ఈ రెండు ఓపెన్ ఆఫర్ల కోసం అదానీ గ్రూప్ రూ. 30,100 కోట్లు వెచ్చించనుంది. ఈ ఓపెన్ ఆఫర్ ప్రతిపాదనలకు సెబీ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. అంబుజా సిమెంట్ షేర్ ఇవాళ 1.95 శాతం లాభంతో రూ. 417 వద్ద ముగిసింది. అలాగే ఏసీసీ షేర్ రూ. 2342 వద్ద ముగిశాయి. మరి అదానీల ఓపెన్ ఆఫర్లకు ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.