రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతం
రిటైల్ ఽద్రవ్యోల్బణం జూన్ నెలలో స్వల్పంగా తగ్గింది. మే నెలలో 7.04 శాతం ఉన్న ఈ సూచీ జూన్లో 7.01 శాతానికి తగ్గింది. ఆర్బీఐ ఆశించిన గరిష్ఠ లక్ష్యం 6 శాతం ఇంకా చాలా దూరంలో ఉంది. ద్రవ్యోల్బణం నాలుగు శాతం (రెండు శాతం ప్లస్ లేదా మైనస్)గా ఆర్బీఐ టార్గెట్ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా 6 నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి ఎగువనే ఉంటోంది. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా విధానాలను తెస్తున్న ఆర్బీఐ మున్ముందు కీలక వడ్డీరేట్లను మరింత పెంచనుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. జూన్లో కూరగాయల ధరలు బాగా పెరిగాయి. పప్పు ధాన్యాల ధరలు స్వల్పంగా తగ్గినట్లు ఎన్ఎస్ఓ అంటోంది. తృణధాన్యాలు 5.66 శాతం పెరగగా, ఇంధనం మరియు విద్యుత్ విభాగ చార్జీల పెరుగుదల 10.39 శాతంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఈ ఏడాది మే నెలకు భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు ఏడాది గరిష్ఠ స్థాయి 19.6 శాతానికి చేరుకుంది. మే నెలలో మాన్యుఫాక్చరింగ్ రంగ ఉత్పత్తి రేటు 20.6 శాతం పుంజుకోగా.. విద్యుత్ రంగం 23.5 శాతం, మైనింగ్ రంగం 10.9 శాతం వృద్ధి సాధించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది.