అంతర్జాతీయ మార్కెట్లో హాట్ టాపిక్
ఎడుటెక్ కంపెనీ బైజూస్ మరోసారి కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభంలో ఉందని, అందుకే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందని వార్తలు వచ్చాయి. అయితే విదేశీ కంపెనీల నుంచి నిధులు సమీకరిస్తున్న సొమ్ము… కంపెనీ ఖాతాల్లో కన్పించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈనెల నాలుగో తేదీన రెండు కంపెనీల నిధులు (రూ. 2500 కోట్లు) కన్పించడం లేదని వార్తలు వచ్చాయి. ఇపుడు మరో కంపెనీ నుంచి రూ.1200 కోట్ల నిధులు లెక్కలు లేవని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది?
తొలి కథనం
బైజూస్ నిధుల వ్యవహారంపై Morning Context అనే మీడియా సంస్థ వరుస కథనాలు రాస్తోంది. Morning Context ఈనెల 4వ తేదీన తొలి కథనం ప్రచురించింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించినట్లు బైజూస్ అంటోంది. కాని ఆ మొత్తం బైజూస్ కంపెనీ ఖాతాల్లో కన్పించడం లేదని Morning Context అంటోంది. గత ఏడాది 80 కోట్ల డాలర్ల నిధులను సమీకరింస్తున్నట్లు బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ వెల్లడించారు. అంటే దాదాపు రూ. 6000 కోట్లు అన్నమాట. ఇందులో సగం సొమ్ము తనే తెస్తున్నట్లు రవీంద్ర చెప్పారు. అంటే మరో రూ. 3000 కోట్లు ఇతరుల నుంచి సమీకరించారన్నమాట. ఈ మేరకు విట్రూవియన్, సుమేరు వెంచర్స్, బ్లాక్‌రాక్ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. కేంద్ర ప్రభత్వం కంపెనీ వ్యవహారాల శాఖ వెబ్సైట్ ప్రకారం చేస్తూ ఎఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కింద విట్రూవియన్ నుంచి మార్చి 29న రూ. 571 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. మరి సుమేరు, బ్లాక్ రాక్ నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయనేది సస్పెన్స్‌గా ఉందని Morning Context పేర్కొంది.అంటే దాదాపు రూ. 2500 కోట్ల నిధులకు లెక్కలు లేవన్నమాట. తాము ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలుసుకునేందుకు ఈ సంస్థలు ఓ నిఘా/దర్యాప్తు సంస్థను నియమించాయి. Kroll అనే ఈ సంస్థ దర్యాప్తు చయగా సుమేరు నుంచి వచ్చిన మొత్తం బైజూస్‌కు చేరలేదని తెలుస్తోంది. విచిత్రమేమిటంటే.. అసలు సుమేరు వెంచర్స్ అనే సంస్థ గురించి తమకు తెలియదని అనేక మంది పారిశ్రామిక వేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు అన్నట్లు Morning Context పేర్కొంది. దీంతో ఈ నిధుల గోల్మాల్ ఏమిటనేది అంతకుచిక్కడం లేదు.
తాజా కథనం
ఇపుడు అమెరికాకు చెందిన ఓ కంపెనీ నుంచి తీసుకున్న రూ.1200 కోట్లు కంపెనీ ఖాతాల్లో చూపలేదని … ఆ సొమ్ము ఏమైందో తెలియడం లేదని Morning Context అనే పేర్కొంది. ఆక్షాట్ క్యాపిటల్ పార్టనర్స్ (Oxshott Capital Partners) అనే కంపెనీ 2021 సెప్టెంబర్‌లో బైజూస్‌లో రూ. 1200 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సొమ్ము బైజూస్‌కు రాలేదని తెలుస్తోంది. బైజూస్ ఖాతాల్లో సదరు ఆక్షాట్ కంపెనీ పేరు కాని, ఆ సంస్థ నిధుల ప్రస్తావన లేదని Morning Context వెల్లడించింది. బైజూస్ సిరీస్ ఎఫ్ రౌండ్ కింద రూ. 2,200 కోట్ల నిధులు సమీకరిస్తున్నట్లు ప్రకటించగా, ఆక్షాట్ రూ. 1200 కోట్ల పెట్టుబడితో అగ్రస్థానంలో నిలిచింది. గతంలో సుమేరు, బ్లాక్‌రాక్ అనే కంపెనీల పెట్టుబడి మాదిరే ఇవి కూడా బైజూస్ పుస్తకాల్లో కన్పించడం లేదు. ఆక్షాట్ గురించి బైజూస్ వివరణ ఇస్తూ 2021 జూన్‌లో ప్రకటించిన నిధుల సమీకరణలో మొత్తం13 మంది ఇన్వెస్టర్లలో 11 మంది ఇన్వెస్టర్ల నుంచి నిధులు వచ్చాయిని పేర్కొంది. ఆ నిధుల సమీకరణలో ఆక్షాట్ నుంచి అత్యధిక నిధులు లేదని, పైగా వారు చివర్లో వచ్చారని బైజూస్ పేర్కొంది. మొత్తం రూ. 3600 కోట్లలో ఇప్పటికే రూ. 2600 కోట్లు వచ్చాయని పేర్కొంది. విడిఆ ఆక్షాట్ గురించి కంపెనీ కామెంట్ చేయలేదు. ఆక్షాట్ క్యాపిటల్ పార్టనర్స్ చేసిన ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇది. 2021 అక్టోబర్ 4న వీరు ప్రకటించారు. మరి ఈ కంపెనీ నిధులు ఏమైనట్లు? అనే చర్చ ఫైనాన్షియల్ మార్కెట్లో జరుగుతోంది.
అమెరికా మార్కెట్‌పై…
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బైజూస్ .. అప్పులను తీర్చేందుకు రూ.8000 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది. సుమేరు వెంచర్స్, బ్లాక్ రాక్ వ్యవహారంతో పాటు తాజాగా ఆక్షాట్ వ్యవహారంతో బైజూస్ ప్రయత్నాలకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది. బైజూస్ అమెరికాలో విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీని కోసం నాస్డాక్లో లిస్టయిన 2U అనే కంపెనీకి రూ.8000 కోట్లతో టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టయిన Chegg అనే కంపెనీని కూడా టేకోవర్ చేసేందుకు బైజూస్ ప్రయత్నిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
ఆకాష్ డీల్ టెన్షన్…
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను టేకోవర్ చేసిన బైజూస్ … ఆ కంపెనీకి రూ. 8000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆకాష్ ప్రమోటర్లకు సకాలంలో నిధులు చెల్లించలేదని తెలుస్తోంది. ఇంకా అనేక నిధులకు సంబంధించిన వివాదాల కారణంగా కంపెనీ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ బైజూస్ బ్యాలెన్స్ షీట్‌పై సంతకం పెట్టేందుకు నిరాకరించినట్లు మనీకంట్రోల్ అనే వెబ్సైట్ పేర్కొంది. మరోవైపు కాస్త ఆలస్యంగా నిధులు ఇచ్చేందుకు ఆకాష్ ప్రమోటర్లతో బైజూస్ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆడిట్ ఫలితాలను ప్రకటిస్తామని బైజూస్ పేర్కొంది.
కరోనా తరవాత ఓ వెలుగు వెలిగిన ఎడుటెక్ కంపెనీలు ఇపుడు నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ రంగంలోని అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బైజూస్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. ఇలాంటి పరిస్థితిలో కంపెనీ అమెరికా విస్తరణ విజయవంతంగా చేపడుతుందా అన్న అనుమానం మార్కెట్లో వ్యక్తమౌతోంది. ఎందుకంటే బైజూస్ చెబుతున్నట్లుగా విదేశీ కంపెనీల నుంచి అసలు నిధులు సమీకరణ జరుగుతోందా? లేదా పబ్లిక్ స్టంటా? లేదా నిధులను విదేశాల్లోనే దారి మళ్ళిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.