కుప్పకూలిన SGX Nifty
గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో నెట్టుకు వస్తున్న ఈక్విటీ మార్కెట్లకు రాత్రి వాల్‌స్ట్రీట్ ఝలక్ ఇచ్చింది. మళ్ళీ భారీ నష్టాల దిశగా మార్కెట్లు పయనిస్తున్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెంచడం వల్ల గ్రోత్ స్టాక్స్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఇప్పటి వరకు టెక్ షేర్లకే పరిమితమైన పతనం ఇపుడు గ్రోత్ షేర్లకు విస్తరించింది. డౌజోన్స్ దాదాపు రెండు శాతం నష్టపోయింది. ఇక టెక్, ఐటీ షేర్లలో కూడా భారీ ఒత్తిడి రావడంతో నాస్డాక్ ఏకంగా 2.75 శాతం నష్టంతో ముగిసింది. అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీ 2.38 శాతం నష్టపోయింది. ఇటీవల ఆర్జించిన లాభాలన్నీ ఈ ఒక్కదెబ్బతో కరిగిపోయాయి. వాల్‌స్ట్రీట్ ప్రభావం ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. దాదాపు ప్రధాన సూచీలు ఒక శాతం వరకు నష్టంతో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.22 శాతం, హాంగ్‌సెంగ్ 1.33 శాతం నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 250 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… ఓపెనింగ్‌లోనే నిఫ్టి నిన్నటి కనిష్ఠ స్థాయిని దాకే అవకాశముంది.