SBI: నికరలాభంలో 62% జంప్
డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్కెట్ అంచనాలకు మంచి పనితీరు కనబర్చింది. ఇవాళ బ్యాంక్ బోర్డు సమావేశమై తాజా ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ రూ. 8200 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేసింది.అయితే బ్యాంక్ ఏకంగా రూ. 8,432 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలోని రూ.5,196 కోట్లతో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 62.26 శాతం పెరిగింది. బ్యాంక్ ఆదాయం మాత్రం రూ .75,981 కోట్ల నుంచి రూ.78,352 కోట్లకు పెరిగింది. తాజా త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం 4.41 శాతం పెరిగి రూ. 69,678 కోట్లకు చేరింది. అదే నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 28,820 కోట్ల నుంచి రూ. 30,687 కోట్లకు చేరింది. NII మార్జిన్ 3.34 శాతం నుంచి 3.34 శాతానికి పెరిగింది. తాజా ఎన్పీఏలు రూ. 2334 కోట్లని బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ నెలాఖరుకు బ్యాంక్ వద్ద డిపాజిట్లకు రూ. 38,47,794 కోట్లు కాగా, ఇచ్చిన రుణాల మొత్తం రూ. 26,64,602 కోట్లు. పర్సనల్ లోన్లు 14.57 శాతం పెరిగి రూ. 9,52,189 కోట్లకు చేరాయి. అయితే వడ్డీయేతర ఆదాయం మాత్రం రూ. 9,246 కోట్ల నుంచి రూ. 8673 కోట్లకు తగ్గింది.