For Money

Business News

రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆందోళన

దేశంలో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల రుణాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని… శ్రీలంక, పాకిస్తాన్‌ల మాదిరి ఉందని కేంద్రం అంటోంది. నానాటికి దిగజారుతున్న రాష్ట్రాల ఆర్థిక స్థితిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈనెల 16,17 తేదీలలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ధర్మశాలలో జరుగనుంది. బడ్జెట్‌లో చూపని మార్గాల ద్వారా ఇటీవల రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయని కేంద్రం గుర్తించింది. ఈ మధ్యనే ఆర్బీఐ కూడా దీనికి సంబంధించి ఓ పత్రం విడుదల చేసింది. బడ్జెట్‌లో చూపకుండా 2019-20, 2020-21 సంవత్సరాల్లో తెలంగాణ రూ. 56,767 కోట్ల రుణాన్ని తెచ్చిందని ఆర్బీఐ పేర్కొంది. ఇది రాష్ట్ర జీడీపీలో 4.5 శాతానికి సమానమని పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇదే పద్ధతిలో భారీగా అప్పులు చేస్తోందని పేర్కొంది. భవిష్యత్‌ రాబడిని తాకట్టు పెట్టి ఎస్క్రో అకౌంట్ల ద్వారా రుణాలు తెచ్చిన వాటిల్లో తెలంగాణ, యూపీ, పంజాబ్‌, ఎంపీ, హిమాచల్‌ ప్రదేశ్‌ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ 2022-23 ఆర్థిక సంవత్సరం జీఎస్‌డీపీలో ఏకంగా 1.88 శాతం మేర ఇలా అప్పులు చేసింది. ఏపీ తరవాతి స్థానంలో ఉన్న యూపీ రాష్ట్ర ఎస్‌డీపీలో 0.87 శాతం వరకు అప్పు తెచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భారీగా రుణపడి ఉన్నాయని కేంద్రం అంటోంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల బకాయిలు లక్ష కోట్ల రూపాయలను దాటగా, ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలకే రూ. 26,397 కోట్ల అప్పు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్ర రూ. 21,565 కోట్లు, తమిళనాడు రూ.20,990 కోట్ల జెన్‌కోలకు అప్పు ఇవ్వాల్సి ఉంది. ఇవి పెద్ద రాష్ట్రాలు కాగా, ఏపీ కూడా రూ. 10,109 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొంది. ఇక డిస్కామ్‌లకు బాకీ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉంది.ఈ రాష్ట్రం రూ. 11,933 కోట్లు డిస్కామ్‌లకు బాకీ ఉందని, అలాగే ఏపీ కూడా రూ. 9,116 కోట్లు బాకీ ఉందని కేంద్రం పేర్కొంది.