For Money

Business News

బ్రహ్మాస్త్ర ఎఫెక్ట్‌: పీవీఆర్‌, ఐనాక్స్‌ షేర్లు ఢమాల్‌

బ్రహ్మాస్త్ర సినిమా ఎఫెక్ట్‌ భారీగా ఉంటోంది. సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో నిర్మాతలతో పాటు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న మల్టీప్లెక్స్‌ సినిమా షేర్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. బ్రహ్మాస్త్ర రిలీజ్‌తో మల్టీ ప్లెక్స్‌ కంపెనీల వ్యాపారం పెరుగుతుందని.. పీవీఆర్‌, ఐనాక్స్ లీజర్‌ షేర్ల ధరలు ఇటీవల కాస్త పెరిగాయి. ఇవాళ ఉదయం ఈ రెండు కంపెనీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్నింగ్‌ షో పూర్తయిన వెంటనే వచ్చిన పబ్లిక్‌ టాక్‌, రివ్యూలతో ఈ రెండు షేర్లలో భారీ పతనం వచ్చింది.
పీవీఆర్‌ షేర్‌ ఇవాళ ఉదయం రూ. 1965ని తాకింది. అక్కడి నుంచి పడుతూ వచ్చిన షేర్‌ చివర్లో రూ. 1833 వద్ద ముగిసింది. (ఒకదశలో రూ. 1823కి కూడా పడిపోయింది) క్రితం ధరతో పోలిస్తే ఈ షేర్‌ ఇవాళ 5.24 శాతం అంటే రూ. 101.35పైసలు నష్టపోయింది. ఇక ఐనాక్స్‌ కంపెనీ షేర్‌ కూడా ఇదే స్థాయిలో పతనమైంది. ఐనాక్స్‌ షేర్‌ కూడా ఇవాళ రూ. 527.25ను తాకింది. సినిమా రివ్యూలు, పబ్లిక్‌ టాక్‌ వచ్చిన తరవాత ఈ కంపెనీ షేర్‌ రూ.4.86 శాతం అంటే రూ. 25.30 నష్టపోయింది. నిజానికి ఈ షేర్‌ ఒకదశలో రూ. 487.75కు కూడా పడిపోయింది. చివర్లో ఈ రెండు షేర్లు స్వల్పంగా కోలుకున్నా భారీ నష్టాలు తప్పలేదు. ఈ రెండు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఇవాళ ఒక్క రోజే రూ.800 కోట్లు తగ్గినట్లు స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ కాస్త పటిష్ఠంగా ఉండటంతో నష్టాలు తక్కువగా ఉన్నాయని.. లేకుంటే నష్టాలు భారీగా ఉండేవని షేర్‌మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.