ఖజానాకు అదనంగా రూ. 1.3 లక్షల కోట్లు
విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుని… వాటిని రిఫైన్ చేసి మళ్ళీ విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లో కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకం విధించింది. దీనికి ప్రభుత్వానికి ఏడాదికి రూ.1.30 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని వివిధ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. ఈ పన్నులతో ఓఎన్జీసీ లాభాలు తీవ్రంగా తగ్గుతాయని, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనింగ్ మార్జిన్ బ్యారల్‌కు 12 డాలర్ల వరకూ క్షీణిస్తుందని బ్రోకరేజ్‌లు పేర్కొన్నాయి.దీంతో ఈ రెండు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఓఎన్జీసీ షేర్ 20 శాతంపైగా క్షీణించింది. జూలై 1న హఠాత్తుగా పెట్రోల్/ఏటీఎఫ్‌లు (లీటర్‌కు రూ.6/బ్యారల్‌కు 12 డాలర్లు), డీజిల్ (లీటర్‌కు రూ.13/బ్యారల్‌కు 26 డాలర్లు)పై ఎగుమతి సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే. దేశీ క్రూడ్ ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250/ బ్యారల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించింది. దీనికి తోడు రూపాయి మరింత క్షీణించకుండా ఉండేందుకు బంగారంపై దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాల తగ్గింపుతో కేంద్రం ఆదాయంలో రూ.1 లక్ష కోట్లు గండి పడుతుందని అంచనా వేయగా… తాజాగా విధించిన ఈ సుంకాలతో ఆ నష్టం పూడుతుందని భావిస్తున్నారు. ఇపుడు విఢించిన పన్నులు పూర్తి ఏడాది కొనసాగితే క్రూడ్ ఉత్పత్తిపై ద్వారా రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై ద్వారా రూ.52,700 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. తాజా పన్నులతో ప్రభుత్వానికి పూర్తి ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని బ్రోకరేజీ సంస్థలు పేర్కొన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 9 నెలలో రూ. 1 లక్ష కోట్ల ఆదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.