బంగారానికి ‘మాంద్యం’ కలిసొచ్చేనా?
అమెరికా కరెన్సీ, ఈక్విటీ మార్కెట్ల తీరు చూస్తుంటే అమెరికా క్రమంగా మాంద్యంలోకి వెళుతోందా అన్న చర్చ ప్రారంభమైంది. కరోనా సమయంలో ప్రభుత్వం భారీగా కరెన్సీని ప్రింట్ చేయడం, ప్రజలకు ఉచితంగా క్యాష్ ఇవ్వడం .. పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలతో ధరలు బాగా పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో వడ్డీ రేట్లను పెంచుతోంది అమెరికా సెంట్రల్ బ్యాంక్. వడ్డీ రేట్లు పెరగడమంటే… డాలర్ పెరగడమే. డాలర్, వడ్డీ రేట్లు పెరిగితే క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్పీడు తగ్గుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమెరికా మాంద్యంలోకి వెళుతుందన్న చర్చ ఇప్పటికే అమెరికా బిజినెస్ మీడియాలో ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లకు చేరగానే గట్టి మద్దతు అందుకే లభిస్తోంది. గోల్డ్ మైనర్ల సూచీ కూడా గరిష్ఠ స్థాయి నుంచి 25 శాతం క్షీణించింది. దిగువ స్థాయిలో మద్దతు లభిస్తుందని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలా? వొద్దా అన్న చర్చ కూడా మొదలైంది. మాంద్యం వచ్చే పక్షంలో బులియన్ కూడా మిశ్రమంగా ఉంటుంది. అంటే బంగారానికి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటే.. వెండి పడే అవకాశముంది. 1,800 డాలర్ల స్థాయి ఇపుడు చాలా గట్టి మద్దతు స్థాయిగా మారింది. అమెరికా డాలర్ బలంగా ఉండే పక్షంలో మన దేశంలో రూపాయి బలహీనపడటం ఖాయంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొద్దిగా పెరిగినా.. మన దేశంలో అధిక ధర పలికే అవకాశముంది. బులియన్పై నిర్ణయం తీసుకునే ముందు జూన్లో ఫెడ్ నిర్ణయం కోసం ఎదురు చూడటం మంచిదని అనలిస్టులు అంటున్నారు.