ఐటీ పాయే… ఇక ఫార్మా?
ఐటీ షేర్లు ఇన్వెస్టర్లను చావుదెబ్బ తీశాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు ఆకర్షణీయంగా లేకపోవడంతో ఆ పరిశ్రమలోని దాదాపు అన్ని షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. చివరికి టీసీఎస్ షేర్ కూడా భారీగా నష్టపోక తప్పలేదు. మైండ్ ట్రీ మంచి ఫలితాలు ఇచ్చినా… ఐటీ మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు జంకుతున్నారు. అనేక మిడ్ క్యాప్ ఐటీ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చడమే డీనికి కారణం. ఇక ఫార్మా వంతు. ఫార్మా రంగం నుంచి కూడా ఈసారి సాధారణ ఫలితాలే ఉంటాయని, ఎలాంటి చమక్కులు ఉండవని సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్ అంటోంది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ఫలితాలపై రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే అమెరికాలో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం కంపెనీ లాభదాయకత దెబ్బతినే అవకాశముందని అంటున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పనితీరులో పెద్ద మార్పు ఉండదని అంటున్నా… కనీసం టర్నోవర్, లాభాఆలు పది శాతం తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనలిస్టులు అంటున్నారు. గట్టి బ్రాండ్ అయిన సన్ ఫార్మా వంటి షేర్లు కాస్త నిలదొక్కుకోవచ్చని అంటున్నారు. నాణ్యమైన ప్రొడక్ట్స్ ఆ కంపెనీ చేతిల ఉండటమే. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 40 శాతం లాభం చూపిన దివీస్ ల్యాబ్ ఫలితాలపై కూడా మార్కెట్ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఆ మెరుపులు ఉంటాయా అన్న అంశంపై విశ్లేషకుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే దాదాపు నెల రోజుల నుంచి షేరు ధరలో పెద్ద మార్పులు లేదు. రోజూ వంద రూపాయల తేడాతో ట్రేడవడం మినహా.. పొజిషనల్ ట్రేడర్స్‌కు దీని వల్ల ఒరిగేదేమీ లేదనే చెప్పాలి. ఇది పూర్తి డే ట్రడర్స్ షేర్‌గా మారిపోయింది. గ్లాండ్ ఫార్మా, అరబిందో ఫలితాలను కూడ ఒక మోస్తరు లాభాలకు పరిమితం కావొచ్చని సీఎన్‌బీసీ భావిస్తోంది. అరబిందో కొత్త వ్యాపారంపై ఆశతో ఇన్వెస్టర్లు ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ భారీగా పెరిగినా… మన ఆర్బీఐ రూపాయికి అండగా నిలవడంతో ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ప్రధాన కంపెనీలకు పెద్దగా ప్రయోజనం లేకుండా ఉంది. రూపాయి భారీగా పతనమైతే తప్ప ఫార్మాకు పెద్ద ప్రయోజనం ఉండదు.