24,000: నిఫ్టికి విషమ పరీక్ష

సెప్టెంబర్ 27న నిఫ్టి ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 26277ని తాకింది. అప్పటి నుంచి అంటే సరిగ్గా నెల రోజుల్లో దాదాపు 2000 పాయింట్లు కోల్పోయింది. గత శుక్రవారం నిఫ్టి 24,073ని తాకింది. చివర్లో వచ్చిన కొనుగోళ్ళ కారణంగా 24180 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు బలంగా ఉన్నా… కార్పొరేట్ ఫలితాలు మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. చైనా మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు గడచిన 14 ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా అక్టోబర్‌లో సుమారు రూ. 90,000 కోట్ల దాకా నికరంగా అమ్మారు. ఈ రెండు అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఎప్పటి నుంచి ఓ బలహీన కారణం కోసం ఎదురు చూస్తున్న బుల్ ఆపరేటర్లు మార్కెట్‌పై తమ పట్టు బిగించారు. రేపు నిఫ్టి 24000పైన నిలబడుతుందా అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో కొనసాగుతోంది. ఎందుకంటే మార్కెట్‌కు ఈ స్థాయి చాలా కీలకం. దీపావళి సందర్భంగా షార్ట్ కవరింగ్ వస్తుందని, అదే రోజు అక్టోబర్ డెరివేటివ్స్ క్లోజ్ అవుతున్నందున… నిఫ్టి కోలుకుంటుందని చాలా మంది అనలిస్టులు అంటున్నారు. అయితే టెక్నికల్ అనలిస్టులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిఫ్టి 200 రోజల చలన సగటు అయిన 23,300ను తాకిన తరవాత నిఫ్టి బలంగా కోలుకుంటుందని అంటున్నారు. ఈ మధ్యలో వచ్చే చిన్నపాటి ర్యాలీలు కరిగిపోవడం ఖాయమని అంటున్నారు. సో… దీపావళి నిఫ్టి తారాజువ్వ ఎగసి పైకి వెళుతుందా… లేదా 24000కు చేరి తుస్సుమంటుందా అన్నది చూడాలి.