For Money

Business News

నిఫ్టిని ముంచునున్న ఇన్ఫోసిస్‌?

ఇవాళ ఇన్వెస్టర్లందరూ ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల కదలికల కోసం ఎదురు చూస్తున్నారు. గత వారం చివరి రెండు రోజులు మన మార్కెట్‌కు సెలవు. ఇన్ఫోసిస్‌ ఫలితాలు బుధవారం సాయంత్రం వెలువడ్డాయి. అదే రోజు రాత్రి అమెరికా మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ ఏడిఆర్‌ ఆరు శాతం క్షీణించింది. గురువారం మన మార్కెట్లకు సెలవు. ఆ రోజు కూడా రాత్రి అమెరికా మార్కెట్లలో ఇన్ఫోసిస్‌ మరో 3.5 శాతం దాకా క్షీణించింది. ఇవాళ్టి అమెరికా ప్రి మార్కెట్‌లో అర శాతం పెరిగింది. వెరశి ఇన్ఫోసిస్‌ అమెరికా మార్కెట్లలో 9 శాతంపైగా క్షీణించింది. రాబడి, నికర లాభం.. రెండింటిలోనూ కంపెనీ పనితీరు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేదు. మరి ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ అదే స్థాయిలో క్షీణిస్తుందా లేదా తక్కువ నష్టంతో ట్రేడవుతుందా అన్నది చూడాలి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు దాదాపు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఐటీ కంపెనీల మాదిరిగా బ్యాంక్‌ ఒక త్రైమాసికంలో దాదాపు రూ. 10,000 కోట్ల నికర లాభం ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు బాగా రాణిస్తాయని అనలిస్టులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు మద్దతు లభిస్తుందా? లేదా ఓపెనింగ్‌లోనే భారీ నష్టాలు తప్పవా అన్నది చూడాలి. ఒక భారీగా క్షీణించినా… దిగువ స్థాయిలో ఈ బ్యాంక్‌ షేర్లకు మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.