For Money

Business News

నిఫ్టి ఎందుకు పడుతోంది?

గత కొన్ని రోజులుగా మన మార్కెట్లు పడుతున్నాయి. నిఫ్టి 26000 స్థాయి దాటిన తరవాత మార్కెట్‌లో కరెక్షన్‌ వస్తుందని అనేక మంది టెక్నికల్‌ నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. మన వ్యాల్యూయేషన్స్‌ హద్దులు దాటాయని… అనామక కంపెనీల షేర్లు కూడా అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయని అన్నారు. పబ్లిక్‌ ఇష్యూల మార్కెట్‌లో హడావుడి, ఎస్‌ఎంఈ విభాగంలో జరుగుతున్న ధరల రిగ్గింగ్‌తో చాలా మందికి మార్కెట్‌ ర్యాలీపై అనుమానాలు ఉన్నాయి. పడటానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటున్న సమయంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి చైనాలో ఉద్దీపన ప్యాకేజీల ప్రకటన, రెండోది పశ్చిమాసియాలో యుద్ధం. సాధారణంగా మార్కెట్‌ పతనం కాగానే చాలా మంది యుద్ధమనే భావించారు. మీడియా కూడా అదే ప్రచారం చేసింది. అయితే యుద్ధానికి ముందే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో భారీ అమ్మకాలు చేస్తున్నారు. నిజంగా యుద్ధం వల్ల మన మార్కెట్‌కు సంబంధించి రెండు ప్రధాన రంగాలు ప్రభావితం అయ్యాయి. ఒకటి ముడి చమురు ఆధార పరిశ్రమలు, రెండోది గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే కంపెనీలు. తొలి కారణంగా కింద ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీలు, పెయింట్‌ కంపెనీలతో పాటు టైర్ల తయారీ కంపెనీలపై ముడి చమురు ధరల ప్రభావం అధికంగా ఉంటుంది. కాని ఇటీవల చాలా సార్లు బ్రెంట్ క్రూడ్‌ 75 నుంచి 80 డాలర్ల మధ్య ఉంది. అపుడు పడని ఈ రంగాల షేర్లు ఇపుడు భారీగా పడ్డాయి. ఒక రెండోది ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. మరి ఇతర రంగాలకు చెందిన షేర్లు ఎందుకు పడుతున్నట్లు? విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు ఎందుకు పడుతున్నట్లు. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి షేర్లలో ఒత్తిడి ఎందుకు వస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు బ్లూచిప్‌ కంపెనీల నుంచి ఎందుకు వైదొలగుతున్నాయి.

గడచిన అయిదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 40000 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఒక్క గురువారం రోజే వీరు రూ. 15,243 కోట్ల షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో ఒకేరోజు షేర్లు అమ్మడం బహుశా ఇటీవల చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇవాళ అంటే శుక్రవారం కూడా రూ. 9,897 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇటీవల చైనా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో ఇపుడు విదేశీ ఇన్వెస్టర్లు అక్కడి మార్కెట్‌ వైపు క్యూ కట్టారు. దీనికి ప్రధాన కారణం మన కన్నా చైనా వ్యాల్యూయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉండటమే. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను మన దేశీయ సంస్థ విజయవంతగా ఎదుర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్‌లు భారీగా కొనుగోలు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు స్థాయిలో మన సంస్థలు కొనుగోలు చేసినా… రీటైల్‌ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా క్షీణించాయి. నిఫ్టి కేవలం 1000 పాయింట్లు క్షీణించినా… మిడ్‌ క్యాప్‌ షేర్లలో నష్టాలు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉన్నాయి. ఇటీవల అకారణంగా పెరిగిన కొన్ని మిడ్‌ క్యాప్‌ షేర్లు 30 శాతం దాకా పడ్డాయి. మ్యూచువల్ ఫండ్‌ల వద్ద దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు రెడీ క్యాష్‌లో ఉన్నాయి. అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత స్థాయిలో వీటి వద్ద క్యాష్‌ ఉంది. అయితే మార్కెట్‌ క్రాష్‌ చాలా తీవ్రంగా ఉంది. దాదాపు రూ. 16 లక్షల కోట్ల మేరకు మార్కెట్‌ క్యాప్‌ తగ్గింది. ఇందులో చిన్న ఇన్వెస్టర్ల వాటా అధికంగా ఉంది. మరి మార్కెట్‌ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు సమాధానం… అసలు మార్కెట్‌ ఎందుకు పడిందనేదే? చైనా వల్లనా లేదా పశ్చిమాసియా వల్లనా? యుద్ధం వల్లనే అయితే అన్ని రకాల షేర్లు ఎందుకు పడ్డాయి? మెజారిటీ ప్రపంచ మార్కెట్లు యుద్ధానికి చలించలేదు. మరి మన మార్కెట్లే ఎందుకు స్పందించాయి? పైగా అమెరికా మార్కెట్లు వరుస లాభల్లో ట్రేడవుతున్నాయి. అంటే చైనాకు విదేశీ ఇన్వెస్టర్లు తరలిపోవడమా? మన వద్ద లిక్విడిటీ భారీగా ఉన్న సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఇంకెన్నాళ్ళు మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తారు? రీటైల్‌ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగితే మ్యూచువల్‌ ఫండ్‌లు ఎంతకాలం ఆదుకుంటాయి? చైనా వల్లనే మార్కెట్లు పతనమైతే… వచ్చేవారం మార్కెట్లు కోలుకునే ఛాన్స్‌ అధికంగా ఉంది. ఎందుకంటే మన మార్కెట్‌లో లిక్విడిటీ అధికంగా ఉంది కాబట్టి. యుద్ధం మరింత ముదిరితే ఈ రికవరీ మరింత ఆలస్యం కావొచ్చు. లేదంటే వచ్చే వారం నిఫ్టి మళ్ళీ 25600 స్థాయిని తాకే అవకాశాలు అధికంగా ఉన్నట్లు టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు.

Leave a Reply