నష్టాల నుంచి లాభాల్లోకి…
నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ క్రమంగా లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం మూడు సూచీలు నామ మాత్రపు లాభాల్లోకి వచ్చాయి. నాస్డాక్ 0.25 శాతం లాభపడగా, మిగిలిన సూచీలు నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడరల్ రిజర్వ్ చాలా గట్టి చర్యలు తీసుకుంటుందని… కాని ఈ చర్యలను అమెరికా ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటుందని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ అన్నారు. అమెరికా సెనేట్ కమిటీ ముందు ఆయన మాట్లాడారు. చాలా త్వరగా వడ్డీ రేట్లను పెంచుతామని, అదే సమయంలో లేబర్ మార్కెట్ పటిష్ఠంగా ఉంటుందని అన్నారు. పావెల్ వ్యాఖ్యల తరవాత మార్కెట్ కోలుకుంది. పావెల్ వ్యాఖ్యల తరవాత డాలర్ అర శాతంపైగా నష్టపోగా, బాండ్ ఈల్డ్స్ స్వల్పంగా తగ్గాయి. మరోవైపు ఆరు శాతం దాకా నష్టపోయిన బ్రెంట్ క్రూడ్ కోలుకుంది. ఇపుడు 3 శాతం నష్టంతో 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ బులియన్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. బంగారం స్థిరంగా ఉండగా, సిల్వర్ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది.