నష్టాల్లో వాల్‌స్ట్రీట్
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై ఆశలు సన్నగిల్లడంతో యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. జర్మనీ డాక్స్ 1.45శాతం నష్టంతో క్లోజ్ కాగా, యూరో స్టాక్స్ 50 సూచీ ఒక శాతం నష్టంతో క్లోజైంది. ఇక అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా .. ఇటీవలి లాభాలను చూస్తే స్వల్ప నష్టాలే అని చెప్పొచ్చు. డౌ జోన్స్ కేవలం 0.11 శాతం నష్టంతో ఉంది. అలాగే వాల్‌స్ట్రీట్ 0.64 శాతం నష్టంతో, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచడం ఖాయంగా కన్పించడంతో వృద్ధి రేటు దెబ్బతింటుందనే ఆందోళన మార్కెట్లో కన్పిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడితే కాని.. మార్కెట్ భారీగా కోలుకునే ఛాన్స్ తక్కువగా ఉన్నాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ బాగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ కేవలం రెండు రోజుల్లో 99 నుంచి 97.9కి క్షీణించింది. డాలర్ బలహీనపడటం, అమెరికాలో వారాంతపు క్రూడ్ నిల్వలు అంచనాలకు మించి క్షీణించడంతో క్రూడ్ మళ్ళీ లాభాల్లో ఉంది. బ్రెంట్ క్రూడ్ మూడు శాతం పైగా పెరిగి 113 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.