ఆగండి… ఈ ధర వద్ద కొనండి
సెంటిమెంట్ కోసం ధన్ తెరస్ రోజు కాస్త బంగారం కొన్నా… దీర్ఘకాలిక పెట్టుబడి కోసమైతే… మాత్రం ఇపుడు కొనొద్దని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. కరోనా సమయంలో ప్రతి దేశం ఇష్టానుసారంగా కరెన్సీని ముద్రించింది. దీంతో నోట్ల సర్క్యులేషన్ పెరిగింది. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. అమెరికా వంటి దేశాలు వెంటనే రంగంలోకి దిగి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాయి. చివరికి వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించింది. కాని ఇతర దేశాల్లో పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. ఇంకా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. కరెన్సీలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఇపుడు పశ్చిమాసియా యుద్ధం కారణంగా డాలర్ కూడా పెరిగింది. ఇదే సమయంలో తగ్గాల్సిన బంగారం ధర పెరుగుతోంది. అనేక దేశాల్లో వాటి కరెన్సీల విలువ కూడా తగ్గింది. భారత్‌లో కూడా డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. దీంతో బంగారం ధర పెరిగింది. అనేక దేశాలు కూడా భారీగా బంగారాన్ని కొన్నాయి. ఇక మన దేశంలో పండుగల సీజన్.. పెళ్ళిళ్ళ సీజన్‌తో పసిడికి బంగారం మరింత పెరిగింది. దీంతో ఇపుడు 24 క్యారెట్ల స్టాండర్డ్ బంగారం పది గ్రాముల ధర రూ. 80,000 దాటింది. అయితే ఈ ధర వద్ద బంగారం కొనాల్సిన పనిలేదని… మున్ముందు స్వల్ప కరెక్షన్ వస్తుందని పలువురు నిపుణులు అంటున్నారు.ఈ ఏడాది ఇప్పటికే 24 శాతం పెరిగిన బంగారం ధర కొద్దిగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. సమీప భవిష్యత్తులో పది గ్రాముల బంగారం ధర రూ. 76,500 వద్దకు క్షీణిస్తుందని, ఆ తరవాత రూ. 74,800లకు కూడా పడే అవకాశముందని రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ అంటోంది. ఈ స్థాయిల వద్ద బంగారం కొనొచ్చని… 2025లో పది గ్రాముల స్టాండర్ బంగారం ధర రూ. 83,000 లేదా రూ. 86,000లకు చేరొచ్చని ఈ సంస్థ పేర్కొంది.