HZL: 50 శాతం షేర్లు తాకట్టు
హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (HZL)లో తనకు ఉన్న 29.5 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో వేదాంత గ్రూప్‌ను 64.92 శాతం వాటా ఉంది. ఈ గ్రూప్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో 50.01 శాతం షేర్లను తాకట్టు పెట్టినట్లు సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ పేర్కొంది. కంపెనీ డేటా ప్రకారం కంపెనీలో ప్రమోటర్లకు ఉన్న షేర్లలో 86.05 శాతం షేర్లను ప్రమోటర్లు తాకట్టు పెట్టారు. ఈనెల 23వ తేదీన వేదాంత గ్రూప్ ఈ షేర్లను తాకట్టు పెట్టింది. అయితే మార్చి నెలకే భారీ సంఖ్యలో షేర్లను వేదాంత తాకట్టు పెట్టింది. దీన్ని బట్టి చూస్తే HZLలో ప్రభుత్వ వాటా కొనేందుకు వేదాంత గ్రూప్ చాలా రోజుల నుంచే రెడీ అవుతోందా అన్న అనుమానం కల్గుతోంది. HZL షేర్ మార్కెట్‌లో రూ. 308 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ కంపెనీలో ప్రభుత్వ వాటా కొనుగోలు చేయాలంటే వేదాంత గ్రూప్ కనీసం రూ. 39,000 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ స్థాయి నిధులను కంపెనీ వద్ద రెడీ ఉండవు కాబట్టి… షేర్లను తాకట్టు పెట్టి నిధులను రెడీ చేస్తోందా అన్న చర్చ మార్కెట్‌లో వినిపిస్తోంది. మరి ప్రభుత్వం తన వాటాను ఎలా డిజిన్వెస్ట్ చేస్తుందో చూడాలి.