అరబిందో ఫార్మాకు వార్నింగ్ లెటర్
ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు హైదరాబాద్ సమీపంలో దౌలతాబాద్ వద్ద ఉన్న యూనిట్ -1 కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA ) నుంచి ‘హెచ్చరిక లేఖ’ జారీ అయింది. ఈ యూనిట్లో ఏపీఐ ఔషధాలను ఉత్పత్తి చేస్తారు. ఈ యూనిట్‌ను గత ఏడాది ఆగస్టు 2 – 12 తేదీల్లో USFDA ప్రతినిధి బృందం తనిఖీలు చేసింది. జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్) ప్రమాణాలను పాటించనందున మందుల నాణ్యతా ప్రమాణాలపై ప్రభావం పడుతోందని ఈ అధికారులు గుర్తించారు. దీంతో ‘ హెచ్చరిక లేఖ’ జారీ చేసింది. ఔషధాల నాణ్యతను దెబ్బతీస్తున్న వాటిని చక్కదిద్దడంలో కంపెనీ విఫలమైందని USFDA పేర్కొంది.’తరుచుగా ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయంటే, మందుల ఉత్పత్తి కార్యకలాపాలపై తగినంత యాజమాన్య పర్యవేక్షణ లేదని అనిపిస్తోంద’ ని USFDA పేర్కొంది. ఈ లోపాలను సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో ఈ యూనిట్లో ఉత్పత్తి అయ్యే మందులను అమెరికా మార్కెట్లోకి అనుమతించడం కుదరదని స్పష్టం చేసింది . ఈ ` హెచ్చరిక లేఖ’ ఈ నెల 12న జారీ అయింది. దీనికి సమాధానం ఇవ్వటానికి కంపెనీకి USFDA రెండు వారాల గడువు ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో కూడా ఏడు అంశాలకు సంబంధించి USFDA హెచ్చరికలు చేసింది.