For Money

Business News

నిరాశపర్చిన లారస్‌ ల్యాబ్‌

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి లారస్ ల్యాబ్స్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. త్రైమాసికంలో కంపెనీ రూ.1,029 కోట్ల ఆదాయంపై రూ .154 కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే ఇదేకాలంలో కంపెనీ రూ .1,288 కోట్ల ఆదాయంపై రూ .273 కోట్ల నికరలాభం ప్రకటించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం 20 శాతం, నికరలాభం ఏకంగా 44 శాతం తగ్గిందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలతో పోల్చినా ఆదాయం 14 శాతం, నికరలాభం 24 శాతం క్షీణించింది. ఏఆర్వీ ఏపీఐ (యాంటీ రెట్రోవైరల్ యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్స్) విభాగంలో అమ్మకాలు తగ్గడమే కంపెనీ పనితీరు నిరాశజనకంగా ఉండటానికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి చూస్తే…కంపెనీ రూ .3,511 కోట్ల ఆదాయాన్ని, రూ .597 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది . ఈపీఎస్ రూ .11.1. 2020-21 ఇదేకాలంలో రూ .3,401 కోట్ల ఆదాయంపై రూ . 687 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈపీఎస్ రూ .12.8. నాలుగో (జనవరి – మార్చి) త్రైమాసికం నుంచి మెరుగైన అమ్మకాలు ఉంటాయ’ని లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ అంటున్నారు. బయోటెక్నాలజీ విభాగమైన లారస్ బయో ఆదాయం స్థిరంగా ఉందని, మున్ముందు పెరిగేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తమ ఫార్ములేషన్ల సామర్థ్యం రెట్టింపు అవుతుందని సత్యనారాయణ వెల్లడించారు .