For Money

Business News

మోదీని జైల్లో వేయకుండా కాపాడారు

ప్రస్తుత ప్రధాని, నాటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీ జైలుక వెళ్ళకుండా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆదుకున్నారని సేనా యూబీటీ నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీని కేంద్ర ప్రభుత్వం జైల్లో వేస్తుందని అప్పట్లో వదంతులు వచ్చాయి. అయితే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తిని జైల్లో ఎలా వేస్తారని యూపీఏ ప్రభుత్వాన్ని అప్పటి కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ అడ్డుకున్నారని సంజయ్‌రౌత్‌ తెలిపారు. రాజకీయ విభేదాలు ఉన్నా…అతన ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సీఎం అని శరద్‌ పవార్‌ యూపీఏ కేబినెట్‌ భేటీలో వాదించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాలను ఆయన తాను రాసిన అన్‌లైక్లీ ప్యారడైజ్‌ (Unlikely Paradaise) అనే పుస్తకంలో రాశారు. మరాఠీలో ఇది వరకే వచ్చిన ఈ పుస్తకం ఇంగ్లీషు అనువాదం రేపు విడుదల కానుంది. జైలుకు వెళ్ళకుండా మోదీని కాపాడారు, కాని తనకు చేసిన మేలును, నిజాయితీని మోదీ గుర్తుకు పెట్టుకున్నారా అని సంజయ్‌ రౌత్‌ పుస్తకంలో రాశారు. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న అమిత్‌ షా రహస్యంగా ఆటోలో మాత్రోశ్రీ ఇంటికి వెళ్ళి బాల్‌ థాకరే సాయాన్ని కోరిన విషయాన్ని కూడా సంజయ్‌ రౌత్‌ పుస్తకంలో రాశారు. తన కొడుకుతో కలిసి ఆయన ఆటోలో వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీఐబీ అధికారి ఒకరు అమిత్‌ షా బెయిల్‌ను తిరస్కరిస్తే… శరద్‌ పవార్‌ జోక్యం చేసుకుని ఆయనకు సాయం చేశారని అన్నారు. దీంతో జైలు నుంచి అమిత్‌ షా బయటకు వచ్చారని అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌కు సంబంధించిన కీలక విషయాలను కూడా తన పుస్తకంలో సంజయ్‌ రౌత్‌ ప్రస్తావించారు. మోదీ రాజకీయాలకు వ్యతిరేకంగా జగదీప్‌ ధన్‌కర్‌ స్వంతంత్ర నిర్ణయాలు తీసుకోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను రంగంలోకి దింపారని సంజయ్‌ పుస్తకంలో ఆరోపించారు. జైపూర్‌లో ఉన్న తమ సొంత ఇంటిని అమ్మగా… వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని విదేశాలకు జగదీప్‌ దంపతులు పంపారు. దీనికి సంబంధించిన ఫైలును జగదీప్‌ ముందు ఈడీ అధికారులు ఉంచినట్లు సంజయ్‌ తెలిపారు. ఈడీ ఒత్తిడితోనే జగదీప్‌ రాజీనామా చేశారన్నారు. అలాగే మోదీ, అమిత్‌ షాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసాపై కూడా ఈడీ ఒత్తిడి తెచ్చిందని సంజయ్‌ ఆరోపించారు. ఈడీ ఒత్తిడితోనే ఆయన ఎలక్షన్‌ కమిషనర్‌గా రాజీనామా చేశారన్నారు. ఇప్పటికే ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగుతోంది. ఇపుడు సంజయ్‌రౌత్‌ పుస్తకం ఎలా రాజకీయ రగడ రేపుతుందో చూడాలి.