For Money

Business News

ఆ మందులు మన దేశంలో అమ్మలేదు

గాంబియాలో మృతికి కారణమైన దగ్గు మందును భారతదేశంలో విక్రయించలేదని తేలింది. న్యూఢిల్లీకి చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతి చేసిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లలు మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్న ప్రకటించింది. ఢిల్లీ కంపెనీ ఈ మందులను హర్యానలోని సోనెపట్‌లోని ప్లాంట్‌లో వీటిని తయారు చేసినట్లు తెలిసింది. వెంటనే మనదేశానికి చెందిన సెంట్రల్ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ జరిపింది. మైడెన్‌ తయారు చేసిన ఈ మందులన్నింటిని గాంబియాకు ఎగుమతి చేసిందని… వీటిని భారత్‌లో అమ్మలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రొమెథాజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్సామాలిన్‌ బేబి కాఫ్‌ సిరఫ్‌, మకాఫ్‌ బేబి కాఫ్‌ సిరప్‌, మాగరిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌ బ్రాండ్లతో వీటిని విక్రయించినట్లు తెలుస్తోంది. వీటిలో మోతాదుకు మించి డైతెలీన్‌ గ్లైకాల్‌, ఎథిలైన్‌ గ్లైకాల్‌లను ఉపయోగించినట్లు తేలింది. ఈ రెండు ఔషధాలు మోతాదుకు మించి వాడితే ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. గాంబియాలో మృతి చెందిన చాలా వరకు పిల్లలు కిడ్నీ సమస్యతో మరణించినట్లు తెలుస్తోంది.