For Money

Business News

టెస్లాకు ఇపుడు విలన్‌ మస్క్‌!

టెస్లా కంపెనీ షేర్‌ ఇటీవల భారీగా క్షీణించింది. మంగళవారం రోజే ఈ కంపెనీ షేర్‌ 2,200 కోట్ల డాలర్లు అంటే రూ. 1.91 లక్షల కోట్లు తగ్గింది. టెస్లా షేర్‌ నిన్న రాత్రి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో 8.39 శాతం క్షీణించి 302.80 డాలర్ల వద్ద ముగిసింది. టెస్లా షేర్‌ గత ఏడాది డిసెంబర్‌లో 488.84 డాలర్లను తాకింది. ట్రంప్‌ గెలుపు తరవాత ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి రావడం విశేషం. టెస్లా షేర్‌ భారీగా తగ్గడానికి కారణాలు ఇవాళ బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ రాసిన కథనం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ఈవీ రంగంలో సంచలనం సృష్టించిన టెస్లా… ఇపుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం ఆ కంపెనీ ప్రమోటర్‌ ఎలాన్‌ మస్క్‌ కావడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ వైపు నిలబడి… ఆ పార్టీ గెలుపు కోసం శ్రమించిన ట్రంప్‌… ఇపుడు ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదే ఆయన కొంప ముంచుంది. ట్రంప్‌ విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఎలాన్‌ మస్క్‌ చర్యలను అటు అమెరికాలోనే కాదు.. యూరప్‌లో కూడా టెస్లా వినియోగదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బహిరంగంగా విమర్శిస్తున్నారు. యూరప్‌లోని కంపెనీ షోరూమ్‌లు, తయారీ యూనిట్ల ముందు మస్క్‌ వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు జరిగాయని బ్లూమ్‌ బర్గ్‌ పేర్కొంది. అమెరికాలో అనేక మంది టెస్లా యజమానులతో ఆ వార్తా సంస్థ మాట్లాడింది. మస్క్‌ విధానాల పట్ల చాలా మంది విముఖత చూపుతున్నారు. తమ టెస్లా కార్లను భారీ డిస్కౌంట్‌కు అమ్మేస్తున్నారని కూడా బ్లూమ్‌బర్గ్‌ రాసింది. మస్క్‌ కష్టాల్లో ఉన్న సమయంలో కాలిఫోర్నియా రాష్ట్రం ఆయనకు అండగా నిలిచింది. ఇపుడు ట్రంప్‌ వద్ద చేరిన మస్క్‌ కాలిఫోర్నియాకు చెందిన రాజకీయ నేతలను టార్గెట్‌ చేయడంపై ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మస్క్‌ సలహాలతో ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణణయాల కారణంగా అనేక మంది నిరుద్యోగులవుతున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. యూరప్‌లో టెస్లా కార్ల అమ్మకాలు జనవరిలో ఏకంగా 45 శాతం తగ్గగా, అమెరికాలో కూడా ఈ కంపెనీ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అతి తక్కవ కాలంలో ఇంత తీవ్ర స్థాయిలో ఓ కంపెనీ బ్రాండ్ ఇమేజీ క్షీణించడం తనకు గుర్తుండగా ఏ కంపెనీకి జరగలేదని బర్క్‌లీకి చెందిన టామ్‌ ప్రైస్‌ అనే వ్యక్తి అన్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ రాసింది.
మెజారిటీ అమెరికన్లు ఎలాన్‌ మస్క్‌ను వ్యతిరేకిస్తున్న ప్రముఖ రీసెర్చి సంస్థ ప్యూ రీసెర్చి పేర్కొంది. యూరప్‌లో కూడా క్రమంగా మస్క్‌ వ్యతిరేకుల సంఖ్య పెరుగుతోంది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో టెస్లా వ్యతిరేక ప్రదర్శనలు జరగ్గా, స్వీడన్‌లో మోడల్‌ వై కార్ల రిజిస్ట్రేషన్లు జనవరిలో 48 శాతం క్షీణించగా, మోడల్‌ 3 టెస్లా వాహనాల రిజిస్ట్రేషన్లు 31 శాతం తగ్గాయని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. నెదర్లాండ్స్‌, కొలొరాడొ, ఒరెగాన్‌, వాషింగ్టన్‌లలో మస్క్‌ వ్యతిరేక ప్రదర్శనలు జరగడమే గాక.. కంపెనీ షోరూమ్‌లపై దాడులు కూడా జరిగాయి. ఈ ఏడాదిలో టెస్లా వాహనాల అమ్మకాలు మళ్ళీ వృద్ధి బాట పడుతాయని కంపెనీ అంటున్నా… ఏ మేరకు పెరుగుతాయో గణాంకాలు ఇవ్వలేకపోయింది. దీంతో అనలిస్టులు కూడా టెస్లా బిజినెస్‌ వృద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్‌ నాటి ధరతో పోలిస్తే టెస్లా షేర్‌ ధర ఇప్పటికే 37 శాతం తగ్గింది.