టీసీఎస్ ఉద్యోగుల్లో 35.5 శాతం మహిళలే
ఉద్యోగుల విషయంలో ఐటీ కంపెనీలు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో టీసీఎస్‌ను చూస్తే తెలుస్తోంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీలో తొలి సారి ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల మార్క్‌ను దాటింది. జూన్ నెలాంతానికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,03,331 మంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నిన్న కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన డేటా కూడా ఇచ్చింది. కంపెనీలో ఆరు లక్షల మంది పనిచేస్తున్నా గత త్రైమాసికంలో కంపెనీ నుంచి వెళ్ళిపోయినవారు (attrition rate) 19.7 శాతమని పేర్కొంది. అంటే దాదాపు లక్ష మంది కంపెనీ నుంచి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయినవారి స్థానాలను భర్తీ చేయడంతో పాటు 14,136 మందిని కొత్త వారిని తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంటే ఆరు లక్షల మందిలో 1,16,447 మంది కొత్తవారన్నమాట. వీరిలో 14,136 మంది కొత్తగా చేరగా, మిగిలినవారిని కంపెనీ భర్తీ చేసుకుంది. 180 రోజుల్లో లక్షా 16 మందిని తీసుకోవడమంటే… ఆ కంపెనీ హెచ్ఆర్ విభాగం డబుల్ స్పీడుతో పనిచేస్తున్నట్లే. గత త్రైమాసికంలో 5 శాతం నుంచి 8 శాతం మేర జీతాలు పెంచినట్లు టీసీఎస్ పేర్కొంది. ఉన్నతస్థానాల్లో ఉన్నవారికి ఇంకా ఎక్కువగా జీతాలు పెంచామని, అయితే కంపెనీ వీడుతున్నవారి సంఖ్య 19 శాతం దాటిందని పేర్కొంది. టీసీఎస్ ఉద్యోగుల్లో 35.5 శాతం మంది మహిళా ఉద్యోగులు కావడం విశేషం. కరోనా పరిస్థితులు బాగుపడినా.. ఇంకా 80 శాతం మంది ఇంటి నుంచే పనిస్తున్నారని.. కేవలం 20 శాతం మంది మాత్రమే ఆఫీస్‌కు వచ్చి చేస్తున్నారని టీసీఎస్ పేర్కొంది. తమ కంపెనీలో 153 దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు టీసీఎస్ వెల్లడించింది.