తత్వ లిస్టింగ్: 9 రోజుల్లో 134% లాభం
స్పెషాలిటీ కెమికల్స్ అంటే స్టాక్ మార్కెట్‌కు ఎక్కడ లేని ప్రేమ. దాదాపు అయిదారేళ్ళ నుంచి ఈ రంగానికి చెందిన ప్రతి షేర్ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. అలాగే మార్కెట్ కూడా ఈ షేర్లను ఆదరిస్తోంది. ఎగుమతి ప్రధాన స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే వదోదరకు కెందిన తత్వ చింతన్ ఫార్మా ఇవాళ లిస్టయింది. లిస్టింగ్ లాభాల్లో జొమాటోను మించింది. సబ్స్క్రిప్షన్ పూర్తయిన 9వ రోజే అంటే ఇవాళ ఈ కంపెనీ షేర్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 1,083 గరిష్ఠ ధరకు ఆఫర్ చేసింది. ఈ ఇష్యూకు భారీ స్పందన వచ్చింది. చిన్న కంపెనీ, చిన్న ఈక్విటీ కావడంతో ఇవాళ ఈ షేర్ రూ. 2,111 వద్ద ప్రారంభమై రూ. 2,534ని తాకింది. అంటే దాదాపు 134 శాతం లాభం ఇచ్చింది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 2,301 వద్ద ట్రేడవుతోంది.