ఏడాదిలో 1451 శాతం పెరిగిన షేర్
ఇవాళ మార్కెట్ భారీ నష్టాలతో క్లోజైనా… టాటా టెలిసర్వీసెస్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ముగిసింది. ఇవాళ బీఎస్‌ఈలో ఈ షేర్ రూ. 202.7 వద్ద ముగిసింది. నెల రోజుల్లోనే ఈ షేర్ రూ. 93.55 నుంచి రూ. 202.70కి చేరింది. అంటే రెట్టింపు అయిందన్నమాట. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఈ షేర్ రూ. 10.45 వద్ద ఉండేది. ఏడాది ఇంకా పూర్తి కాకుండానే రూ. 202.70కి చేరింది. చిత్రమేమిటంటే కంపెనీ పనితీరులో పెద్ద మార్పు లేకపోవడం. కంపెనీ పేరు టాటా టెలి సర్వీసెస్ నుంచి టాటా టెలి బిజినెస్ సర్వీసెస్ అని మార్చారు. అంతే తప్ప కంపెనీలో మార్పు లేదు. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. ఏడాది క్రితం ఈ కంపెనీ రూ. 298 కోట్ల నష్టం ప్రకటిచంగా, 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 302 కోట్ల నష్టం ప్రకటించింది. 2021 డిసెంబర్ ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ నష్టాలు రూ. 934 కోట్లు కాగా, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నష్టాలు రూ.1,708 కోట్లు. ఈ స్థాయి నష్టాల ఊబిలో కూరుకుపోయినా… షేర్ ధర ఇలా పెరగడం విచిత్రం. సాధారణంగా చిల్లర షేర్లు… మోసకారి కంపెనీల షేర్లలో ఇలాంటి ట్రెండ్ కన్పిస్తుంది. టాటా గ్రూప్ కంపెనీలో ఇలాంటి ట్రెండ్ కన్పించడం విశేషం.