సుగర్ షేర్లలో కొనసాగునున్న ర్యాలీ
సుగర్ షేర్లు నిన్న స్టాక్ మార్కెట్లో దుమ్మురేపాయి. ఇంట్రా డేలో అనేక చక్కెర కంపెనీల షేర్లు 9 శాతం పైగా లాభపడ్డాయి. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతి ఇవ్వొచ్చనే వార్తలు రావడంతో షేర్లు పరుగులు తీశాయి. బలరాంపూర్ చినీ మిల్స్ , త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ , దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్, ఉత్తమ్ షుగర్ మిల్స్, శ్రీ రేణుకా షుగర్స్ , విశ్వరాజ్ షుగర్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పెరిగాయి. జూన్ 1న చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సుగర్ షేర్లు దాదాపు 35 శాతం వరకు పడిపోయాయి. ఎగుమతులకు అనుమతి వస్తే కోటి టన్నుల చక్కెర ఎగుమతి అవుతుంది. అలాగు సెప్టెంబర్లో అంటే పండుగల సీజన్ ముందు మరో 10 లక్షల టన్నుల ఎగుమతికి అనుమతి రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గుతాయని భావిస్తున్నారు. పైగా ఈ సీజన్లో యూపీ, బీహార్ రాష్ట్రాల్లో చెరకు పంట విస్తీర్ణంపై ఇంకా తుది అంచనాలు రావాల్సి ఉంది. పంట విస్తీర్ణం ఏమాత్రం తగ్గినా..ధరలు మరింత పెరిగే అవకాశముంది.