పెరగనున్న చక్కెర ధర?
చక్కెర ఎక్స్పోర్ట్ కోటాను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్రం ప్రకటించింది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి ఎగుమతి కోటాను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. నిన్న ఆయనను సుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. చక్కెర ఎగుమతి కోటాను వెంటనే ప్రకటించడంతో పాటు చక్కెర కనీస అమ్మకం ధరను పెంచాలని అసోసియేషన్ ప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. ఇపుడు కిలో చక్కెర కనీస అమ్మకం ధర రూ. 31గా ఉంది. దీన్ని రూ. 35- రూ. 36కు పెంచాలని చక్కెర మిల్లులు కోరుతున్నాయి. అలాగే ఎథనాల్ ధరలను కూడా పెంచాలని కోరాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి చక్కెర పరిశ్రమ మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఈ ఏడాది చెరకు దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున.. అధిక చక్కెర ఎగుమతికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నది చూడాలి. చక్కెర అమ్మకం ధరను పెంచకుండా… చక్కెర మిల్లులు లాభపడే విధంగా ఇతర విధానపరమైన నిర్ణయాలను కేంద్రం తీసుకోవచ్చని తెలుస్తోంది. మొత్తం చెరకు ఉత్పత్తిలో ఎథనాల్ కోసం కేటాయించిన కోటా పెరుగుతోంది. మొత్తం చెరకు ఉత్పత్తిలో దాదాపు 10 శాతం ఎథనాల్ తయారీకి కేటాయిస్తున్నారు.