MID SESSION: భారీ నష్టాల్లో నిఫ్టి
నిఫ్టి ఇవాళ 17,300 పాయింట్ల దిగువకు చేరింది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధాన కంపెనీ ఆర్థిక ఫలితాలు వచ్చేశాయి. ఇక మార్కెట్లో ఉన్నవన్నీ నెగిటివ్ అంశాలు… పాజిటివ్ అంశాలు పూర్తయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు నిఫ్టి 17,265 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన తరవాత ఇపుడు 17,298 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 1.2 శాతం నష్టపోగా, బ్యాంక్ నిఫ్టి కూడా ఇదే స్థాయి నష్టాలతో ఉంది. ఎస్బీఐ మినహా మిగిలిన బ్యాంకు షేర్లలో ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టిని ప్రధాన ఆరు అంశాలు దెబ్బతీస్తున్నాయి. ఆర్థిక ఫలితాల సీజన్ పూర్తి కావడంతో… ఇక మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు లేకపోవడం ఒక ప్రధాన కారణంగా… క్రూడ్ ఆయిల్ 100 డాలర్లవైపు పరుగులు తీయడం మరో అంశం. ఇక మూడో అంశం వడ్డీ రేట్ల పెరుగుదల. తక్కువ వడ్డీ రేట్ల రోజులు పోయాయి. ఫెడ్ ఈ ఏడాది అయిదుసార్లు వడ్డీ రేట్లను పెంచనుంది. ఆర్బీఐ కూడా పెంచనుందనే వార్తలు వస్తున్నాయి. నాలుగో అంశం – కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు. దాదాపు ఏడాది నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత రెండు నెలల నుంచి భారీగా అమ్ముతున్నారు. ఇక అయిదో అంశం బ్లూచిప్ షేర్ల నాయకత్వం లేకపోవడం. మార్కెట్లో లీడర్స్‌గా ఉన్న ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. మార్కెట్ రికవరీని ఎవరు లీడ్ చేస్తారన్న అంశంపై అనిశ్చితి. ఇక ఆరో అంశం యూపీ ఎన్నికలు. యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా అన్న అంశంపై భిన్న సర్వేలు వస్తున్నాయి. మోడీ అనుకూల మీడియా కూడా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నా… నామమాత్రపు ఆధిక్యమే ఇస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి అమ్మేసి… యూపీ ఎన్నికల తరవాత పరిస్థితిని చూసి పొజిషన్స్ తీసుకుందామని ఇన్వెస్టర్లు ఆలోచించడం.