డాలర్ దెబ్బకు రూ. 2,200 తగ్గిన వెండి
డాలర్ మళ్ళీ విజృంభిస్తోంది. ఇటీవలకాలంలో మళ్ళీ డాలర్ ఇండెక్స్ 94ను దాటింది. అమెరికా మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.52 శాతం పెరిగి 97.27ని తాకింది. ఈ స్థాయిలో డాలర్ పెరగడంతో ఈక్విటీ మార్కెట్లు నీరస పడిపోతున్నాయి. భారీ నష్టాలతో తరవాత ఇవాళ ఆరంభంలో గ్రీన్‌లో ఉన్న నాస్డాక్ మళ్ళీ నష్టాల్లోకి జారుకునే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నారు. డాలర్ ఈ స్థాయిలో పెరిగినా క్రూడ్ ఆయిల్ స్థిరంగా ఉండటం భారత్ వంటి వర్ధమాన మార్కెట్లను కలవరపరుస్తోంది. తాజా సమాచారం మేరకు ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ 78.28 డాలర్లను దాటింది. నిన్న 80 డాలర్ల దాకా వెళ్ళిన క్రూడ్.. తరువాత తగ్గినా 78 డాలర్లను దాటడం ఇబ్బందే. ఎందుకంటే అర శాతం డాలర్ పెరగడమంటే భారీగా డాలర్లను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక బులియన్ మార్కెట్ కకావికలమైంది. డాలర్ దెబ్బకు వెండి భారీగా క్షీణించడం విశేషం. అమెరికా మార్కెట్లో వెండి నాలుగు శాతంపైగా క్షీణించింది. బంగారం పెద్దగా తగ్గకపోయినా… ప్రధాన మద్దతు స్థాయిని కోల్పోయింది. ఔన్స్ బంగారం ధరకు కీలక మద్దతు స్థాయి 1736 డాలర్లు, ప్రస్తుతం బంగారం 1731 డాలర్ల వద్ద ఉంది. ఇక భారత మార్కెట్ విషయానికొస్తే ఎంసీఎక్స్‌లో స్టాండర్డ్ బంగారం 10 గ్రాముల ధర స్థిరంగా 45,969 వద్ద ట్రేడవుతోంది. కాని వెండి భారీగా క్షీణించింది ఒకదశలో రూ. 2,200 క్షీణించి రూ.58,181 పడిన వెండి ఇపుడు రూ.58,493 వద్ద ట్రేడవుతోంది.